TELANGANA

రవాణా శాఖలో తెలంగాణ సర్కార్ సంచలన జీవో..!

మైనర్లు వాహనాలు నడపడిపితే మోటారు వాహనాల చట్టం సెక్షన్ 199-ఏ ప్రకారం తల్లిదండ్రులు, సంరక్షకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని రవాణాశాఖ స్పష్టం చేసింది. జీవోను బుధవారం విడుదల చేసింది. అన్ని రవాణాశాఖ కార్యాలయాలకు జీవో కాపీలను పంపించింది. 18ఏళ్ల లోపు వయస్సు గల వారికి వాహనాలు నడపడానికి ఇవ్వవద్దనితల్లిదండ్రులు, సంరక్షకులకు రవాణాశాఖ విజ్ఞప్తి చేసింది. ఇలా చేయడం చట్టపరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది.

 

సెక్షన్ 199-ఏ ప్రకారం..

మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 199-ఏ (2019 సవరణ) ప్రకారం, ఒక మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే ఆ వాహన యజమాని/సంరక్షకుడు నేరస్తుడిగా పరిగణించడం జరుగుతుందని, చట్టం నిర్దేశించిన శిక్షకు అర్హులవుతారని అన్నారు. ఆ వాహనం రిజిస్ట్రేషన్ పన్నెండు నెలల పాటు రద్దు చేయబడుతుందన్నారు. ఆ మైనర్‌కు 25ఏళ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయబడదన్నారు.

 

4,070 వాహన రిజిస్ట్రేషన్లు రద్దు..

గత ఆర్థిక సంవత్సరంలో, మైనర్లు వాహనాలు నడపడానికి అనుమతించినందుకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4,070 వాహన రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిబంధనను రవాణా శాఖ ఎంత కఠినంగా అమలు చేస్తున్నదో ఇది స్పష్టం చేస్తుందన్నారు. పిల్లల భద్రత, ప్రజల భద్రత దృష్ట్యా, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేసింది. వాహన రిజిస్ట్రేషన్ కోల్పోవడంతో పాటు, మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఏడేళ్లకు పైగా ఆలస్యం జరిగే తీవ్రమైన, దీర్ఘకాలిక చట్టపరమైన పరిణామాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం నిఘా కొనసాగించాలని తనిఖీ అధికారులను ఆదేశించింది.