AP

టీడీపీ నేతలకు మంత్రి నిమ్మల వార్నింగ్..!

ప్రతి నాయకుడు, కార్యకర్తకు పార్టీ సిద్ధాంతం, క్రమశిక్షణే ముఖ్యం అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పార్టీ లైన్ దాటి ప్రవర్తించే నాయకుడు, కార్యకర్తను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీకి, రాష్ట్రానికి నష్టం చేకూర్చే చర్యలను ఎంతటి నాయకులైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారుని గుర్తు చేశారు.

 

ఉద్యోగాలు కల్పన..

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీల కష్టం, త్యాగంతో ఈ విజయం సాధ్యమైందని, గత ఐదేళ్ల విధ్వంస పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోందని అన్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం పనులతో పాటు తరలిపోయిన పరిశ్రమలను వెనక్కి తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌లు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కష్టపడి పనిచేస్తున్నారని వారి కృషికి తగ్గట్టగా మనందరం కలిసి పనిచేయాలని అన్నారు.

 

పార్టీలైన్ దాటితే..

వ్యక్తిగత అభిప్రాయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధే మనకు అత్యంత ముఖ్యం అని తేల్యి చెప్పారు. ప్రభుత్వం సాధించిన సంక్షేమాన్ని నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. టీడీపీ ఇస్తున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా నమ్మకంతో పనిచేయాలని అన్నారు. ప్రజలు మనకు ఇచ్చే గౌవరం పార్టీ సింబల్ ద్వారానే అనేది గుర్తు పెట్టుకోవాలని, గీత దాటిన నాయకులు, కార్యకర్తలను హెచ్చరిస్తామని తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.