వచ్చే ఎన్నికల్లో 50 శాతానికి పైగా జెన్-జీ తరం ఓటర్లే కీలక పాత్ర పోషించబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల నీట్ పరీక్ష వైఫల్యంపై జరిగిన పోరులో ‘ఇన్‌స్టా పిల్లలు’ విజయం సాధించారని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మారుతున్న రాజకీయ సమీకరణాలు, యువతరం ప్రాధాన్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“యువతరం సరికొత్త రీతిలో ఢిల్లీలో కదం తొక్కింది. ఎవరితోనైతే ఘర్షణకు వెళ్లకూడదో, ప్రధాని మోదీ సరిగ్గా వారితోనే తలపడ్డారు. ఇటీవల జరిగిన పరిణామాల్లో ‘వాట్సాప్ అంకుల్స్’తో సాగిన పోరులో ‘ఇన్‌స్టా పిల్లలు’ ఎలా పైచేయి సాధించారో దేశం మొత్తం చూసింది” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సైతం అర్ధరాత్రి సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా లేకపోతే పాలకుల్లో జవాబుదారీతనం ఉండేది కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నేటి యువత వార్తాపత్రికలు చదవడం గానీ, టీవీ ఛానెళ్లు చూడటం గానీ తగ్గించారని, 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారు వార్తలను సైతం రీల్స్ రూపంలోనే వీక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

