TELANGANA

సూర్యాపేటలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన.. విద్యార్థులతో ప్రతిజ్ఞ

సూర్యాపేటలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలన, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట పోలీసు శాఖ, సూర్యాపేట బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డులో ఉన్న జయ పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణతో కూడిన మంచి అలవాట్లు జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని, మంచి భవిష్యత్తు, విజయానికి అవి పునాది వేస్తాయని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

తప్పులు చేసే వారిని సంస్కరించేందుకు చట్టాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. యువత మంచి, చెడును గుర్తించి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.