కర్నూలు జిల్లా గోనెగండ్లలో 72 ఏళ్ల చాకలి ఈరమ్మ ఆత్మహత్య ఘటనపై పోలీసులు 12 మందిపై BNS సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశారు. వృద్ధురాలి భూమికి సంబంధించి ఇతరులకు పాస్‌బుక్ మంజూరు చేయడంలో అధికారులు వ్యవహరించిన తీరుపై, అలాగే ఆమెపై మరో వర్గం దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై వృద్ధురాలి కుమారుడు కర్రెన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన తల్లి భూమి విషయంలో అధికారులు, మరో వర్గానికి చెందిన వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారని కర్రెన్న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గోనెగండ్లకు చెందిన మరో రాజేశ్వరి, వీఆర్‌ఓ మునీర్, సర్వేయర్ జయప్రకాష్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూమి వ్యవహారంలో అధికారుల పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అదేవిధంగా వృద్ధురాలిపై దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో గొల్ల నారాయణ, గొల్ల శేషు, గొల్ల రాజు, గొల్ల రంగస్వామి, గొల్ల సూరి, గొల్ల మురళి, గొల్ల రామాంజనేయులు, గొల్ల వీరేష్, గొల్ల రాజేష్‌లపై కూడా కేసు నమోదైంది. మొత్తం 12 మందిపై కేసు నమోదు చేసి ఘటనకు దారితీసిన పరిస్థితులు, భూమి వివాదానికి సంబంధించిన అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

