నూతనంగా ఎన్నికైన ఎన్డీయే రాజ్యసభ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక సూచనలు చేశారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు కొత్త ఎంపీల కోసం తన నివాసంలో మోదీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు పలువురు కొత్తగా ఎన్నికైన ఎంపీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యకలాపాల్లో ఎంపీలు చురుగ్గా పాల్గొనాలని ప్రధాని సూచించినట్లు సమాచారం. వీలైనంత ఎక్కువ సమయాన్ని సభా కార్యకలాపాలకే కేటాయించాలని, చర్చలు, సమావేశాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లడంలో బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా పార్లమెంట్లో 100 శాతం హాజరు ఉండేలా ప్రతి ఎంపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మోదీ సూచించినట్లు సమాచారం. సభా కార్యకలాపాలను అర్థం చేసుకోవడంతో పాటు పార్లమెంటరీ విధానాలు, నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని కొత్త ఎంపీలకు ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది.

