ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి తరం యువతకు (జెన్-జీ) పలు కీలక సూచనలు చేశారు. జీవితంలో అడ్డదారుల వెంట పడొద్దని, అవి అంతిమంగా తీవ్ర నష్టాలకే దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, రీల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం నాడు ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
రైల్వే స్టేషన్లలో తరచూ కనిపించే ఒక హెచ్చరికను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. “షార్ట్‌కట్ విల్ కట్ యు షార్ట్” (అడ్డదారి మీ జీవితాన్ని కుదిస్తుంది) అనే బోర్డు కేవలం రైల్వే ట్రాక్‌లకే కాకుండా, నిజ జీవితానికి కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులో ఉన్నప్పటికీ, త్వరగా వెళ్లాలనే తొందరలో కొందరు ప్రమాదకరంగా పట్టాలు దాటుతుంటారని, అటువంటి అనాలోచిత నిర్ణయాలు ప్రాణాంతకమని ఆయన హెచ్చరించారు.
యువత తప్పుడు మార్గాలను వీడి, అర్థవంతమైన జీవన గమనాన్ని ఎంచుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. “మీరు ఆరాధించే మహనీయుల జీవిత చరిత్రలను తప్పనిసరిగా చదవండి. వాటి ద్వారా స్ఫూర్తి పొంది సరైన మార్గాన్ని కనుగొనవచ్చు” అని ఆయన యువతకు సలహా ఇచ్చారు. ముఖ్యంగా ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే ఇన్‌ఫ్లుయెన్సర్ల కంటెంట్ పట్ల నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు.

