తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సంగారెడ్డి వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్డులు పంపిణీ చేయనున్నారు. అయితే పంపిణీకి ముందే కార్డులపై రాజకీయ వివాదం మొదలైంది.
కార్డుపై ఇద్దరి ఫొటోలే..
ప్రభుత్వం విడుదల చేసిన స్మార్ట్ రేషన్ కార్డు నమూనాలో సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యంలో కేంద్రం కీలకంగా నిధులు సమకూరుస్తున్నప్పుడు ప్రధాని ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ నేతల ఆగ్రహం
ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం అందిస్తున్న రేషన్ బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రచారం కోసం సీఎం, మంత్రి ఫొటోలు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. పేదలకు ఉచిత బియ్యం అందించడంలో కేంద్రం పాత్రను గుర్తించాలని డిమాండ్ చేశారు.
‘కార్డుల పంపిణీ ఆపాలి’
మరో ఎంపీ ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో ప్రభుత్వం మారితే మళ్లీ కొత్త కార్డులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఎంపీ రఘునందన్‌రావు సైతం ప్రధాని ఫొటో లేకుండా కార్డుల పంపిణీ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి సభపై ఉత్కంఠ
ఒక్కో లబ్ధిదారుడికి అందే ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోలు కేంద్రం ఇస్తోందని రఘునందన్‌రావు పేర్కొన్నారు. మోదీ ఫొటో లేకపోవడం కేంద్రాన్ని అవమానించడమేనని ఆరోపించారు. సంగారెడ్డి సభలో నిరసనల నేపథ్యంలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే బీజేపీని బాధ్యులను చేయొద్దని హెచ్చరించారు. దీంతో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

