TELANGANA

తెలంగాణలో ‘సర్‌’ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 92 లక్షల మందికి నోటీసులు..!

తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. సర్‌కు ముందు రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. గడువులోగా ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించిన 2,64,87,214 మంది పేర్లతో ముసాయిదా జాబితా రూపొందించినట్లు చెప్పారు.

మొత్తం ఓటర్లలో 78.03 శాతం మంది పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయని సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. మరోవైపు 73 లక్షల మంది ఓటర్లు ఏఎస్‌డీడీ (అబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెడ్, డూప్లికేట్‌) జాబితాలో ఉన్నట్లు చెప్పారు. అన్‌మ్యాప్డ్‌ జాబితాలో ఉన్న 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

నోటీసులు అందుకున్నవారు తమ వివరాలపై వివరణ ఇచ్చేందుకు సెప్టెంబర్‌ 16 వరకు గడువు ఉంటుందని తెలిపారు. ఈ నోటీసులను బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) పోస్టు ద్వారా పంపించనున్నట్లు చెప్పారు. తమ పేరు జాబితాలో లేకపోయినా అర్హత ఉన్నవారు ఫారం 6ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.