తెలంగాణలో పేదల సంక్షేమానికి సంబంధించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పథకాలను యథాతథంగా కొనసాగించాలని, అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ ఎదుట బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన భారీ ధర్నాలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ పథకాలపై కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసి కూడా, కావాలనే ప్రభుత్వం తరఫున సరైన వాదనలు వినిపించకుండా కోర్టు నుంచి వ్యతిరేక తీర్పు వచ్చేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ, ఈ సంక్షేమ పథకాలను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతుండటం విచారకరమన్నారు.
అలాగే నల్గొండ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని అనర్హులకు ఇచ్చారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. జాయింట్ కలెక్టర్ మెమోరాండం స్వీకరించేందుకు రాగా బీఆర్‌ఎస్ నాయకులు ఇచ్చేందుకు నిరాకరించారు. చివరకు గ్రీవెన్స్ సెల్‌లో కలెక్టర్‌ను కలవడానికి పోలీసులు అనుమతించడంతో, నాయకులు కలెక్టర్‌ను నేరుగా కలిసి తమ వినతిపత్రాన్ని అందజేశారు

