AP

వైఎస్ జగన్ బిగ్ అనౌన్స్‌మెంట్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని పిలుపు..

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర  వ్యతిరేకత ఉందని జగన్‌ అన్నారు. ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారని, అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారాయని, ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు చెలరేగుతున్నాయని జగన్‌ ఫైర్ అయ్యారు. గంజాయి రవాణాలో పోలీసులు పట్టుబడటం దారుణమని వ్యాఖ్యానించారు. డాక్టర్‌ ప్రియాంక హత్య కేసులో పోలీసులు, అధికార పార్టీ కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని చంద్రబాబుపై జగన్‌ ఫైర్ అయ్యారు.

విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు ఎవరూ సంతోషంగా లేరని జగన్‌ అన్నారు. రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, గత వైసీపీ ఐదేళ్ల పాలనతో ప్రస్తుత పాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారని వెల్లడించారు. మరో ఏడాదిలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్‌ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఏడాదే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం వైఎస్సార్‌సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. నిత్యం ప్రజలతో మమేకమై పనిచేయాలని పార్టీ నేతలకు జగన్‌ పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్‌ నేతల సమావేశంలో జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.