నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి దారుణ హత్య కేసు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నెల 11న జరిగిన ఈ ఘాతుకంపై పోలీసులు జరిపిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు, సుమారు 80 మందిని సమగ్రంగా విచారించారు. విచారణ ఆధారంగా.. చెడు వ్యసనాలకు బానిసలైన స్థానిక తండాలకు చెందిన ముగ్గురు విద్యార్థులే ఈ హత్యకు ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఈ పాఠశాలకు చెందిన పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. జేబీ కాలనీలోని ప్రిన్సిపల్ నివాసంలోనే ఈ ప్లాన్ అమలు చేసినట్లు అనుమానిస్తున్నారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అనుమానితులైన విద్యార్థులను ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విలాసాలకు, చెడు అలవాట్లకు డబ్బులు చాలకనే వీరు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది.
రూపారెడ్డిని హత్య చేసిన అనంతరం, ఆ విద్యార్థులు ప్రిన్సిపల్ వద్ద ఉన్న సుమారు రూ. 4 లక్షల నగదును చోరీ చేసి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ చోరీ కోసమే పక్కా పథకం ప్రకారం హత్య చేశారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు బుధవారం సాయంత్రం లోగా వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.

