AP

జగన్‌కు ఏపీపీఎస్సీ, డీఎస్సీకి తేడా తెలియదు: మంత్రి నారా లోకేశ్..

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌కు ఏపీపీఎస్సీ, డీఎస్సీల మధ్య గల వ్యత్యాసం కూడా తెలియదని, ఆ అజ్ఞానం వల్లే గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు జగన్ పాత ప్రెస్ మీట్ వీడియోను లోకేశ్ గురువారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.

“ఏపీపీఎస్సీ అంటే ఏమిటో తెలియదు, డీఎస్సీ అంటే ఏమిటో తెలియదు. రెండూ ఒకటే అని జగన్ భావిస్తున్నారు” అంటూ లోకేశ్ తన పోస్ట్‌లో ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని నియామక వ్యవస్థలపై జగన్‌కు ఉన్న అవగాహన లోపం వల్లే గత ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించలేకపోయారని విమర్శించారు. ఉద్యోగ నియామకాలపై అసెంబ్లీలో జరిగే చర్చ నుంచి కూడా జగన్ పారిపోతున్నారని ఆక్షేపించారు.

ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్), డీఎస్సీ (జిల్లా ఎంపిక కమిటీ)… ఈ రెండు వేర్వేరు వ్యవస్థలనే కనీస పరిజ్ఞానం కూడా జగన్‌కు లేదని లోకేశ్ విమర్శించారు. తన పోస్టుకు #DSCFakesByYCP, #JaganAPPSCrecruitmentScam వంటి హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఆయన జతచేశారు.