హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన వేలంలో ఎకరా భూమి ఏకంగా రూ. 264 కోట్లు పలికింది. మొత్తం 5.25 ఎకరాల ప్లాట్ విక్రయం ద్వారా ప్రభుత్వ సంస్థ అయిన టీజీఐఐసీకి రూ. 1,386 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. హైదరాబాద్‌లో భూమి ధరకు సంబంధించి ఇదే ఆల్ టైమ్ రికార్డ్.
రాయదుర్గం పాన్‌మక్తాలోని సర్వే నెం. 83/1లో ఉన్న ప్లాట్ నెం. P1 కోసం శుక్రవారం ఈ-వేలం నిర్వహించారు. ఎకరాకు రూ. 175 కోట్ల కనీస ధరతో వేలం ప్రారంభించగా, దానిపై ఏకంగా 50.9 శాతం అధికంగా ధర పలికింది. ఇదే కారిడార్‌లో గత మే నెలలో టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ. 237 కోట్లు పలికింది. తాజా వేలంలో ఆ రికార్డు బద్దలైంది.
హైదరాబాద్ ఐటీ, నాలెడ్జ్ సిటీ గ్రోత్ కారిడార్‌లో ఈ భూమి ఉండటం దీనికి ప్రధాన కారణం. ఐటీసీ కోహినూర్ హోటల్‌కు ఎదురుగా, దుర్గం చెరువు, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు అత్యంత సమీపంలో ఈ ప్లాట్ ఉంది. మల్టీ-యూజ్ జోన్‌గా ఉన్న ఈ భూమి కోసం పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఈ వేలంలో పాల్గొనేందుకు బిడ్డర్లు రూ. 10 కోట్ల డిపాజిట్ చెల్లించారు.
ఈ భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ చారిత్రక రాతి కట్టడాలు ఉన్నాయని, దుర్గం చెరువుకు సమీపంలో ఉన్నాయని, యాజమాన్య హక్కుల వివాదాలు ఉన్నాయని పిటిషనర్లు ఆరోపించారు. అయితే, వేలం ప్రక్రియను నిలిపివేసేందుకు న్యాయస్థానాలు నిరాకరించాయి. ఈ ప్లాట్లు రక్షిత వారసత్వ ప్రాంతాలు, బఫర్ జోన్ల పరిధిలోకి రావని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గత కొన్నేళ్లుగా రాయదుర్గం ప్రాంతంలో భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 2025లో ఇక్కడ ఎకరా ధర రూ. 177 కోట్లుగా ఉండేది. ఇప్పుడు అంతకుమించి రికార్డు ధర పలికింది. తాజా డిమాండ్ నేపథ్యంలో, ఇదే సర్వే నంబరులో మరో 5.38 ఎకరాల ప్లాట్‌కు ఆగస్టు 28న వేలం నిర్వహించనున్నట్లు టీజీఐఐసీ ప్రకటించింది. వరుస వేలాలతో రాయదుర్గం

