AP

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన “జాబ్ క్యాలెండర్-2026″ను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆగస్టు 22, 2026న జీవో నెం.81ను జారీ చేశారు. ఈ నియామక ప్రక్రియను నాలుగు విడతల్లో పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ, ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు), డీఎస్సీ వంటి నియామక సంస్థల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యతలైన మౌలిక సదుపాయాల కల్పన, విద్య, సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, “స్వర్ణాంధ్ర@2047” లక్ష్యాలకు అనుగుణంగా ఈ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 10,060 పోస్టులను నాలుగు దశల్లో భర్తీ చేయనుండగా, వాటి షెడ్యూల్ కింది విధంగా ఉంది:

మొదటి విడత: 1,523 పోస్టులు (ఇప్పటికే ఉన్నత విద్యా శాఖ 2026 మే 15న నోటిఫికేషన్ జారీ చేసింది). 
రెండో విడత: 3,231 పోస్టులు (నోటిఫికేషన్ తేదీ: 2026 సెప్టెంబర్ 15). 
మూడో విడత: 2,311 పోస్టులు (నోటిఫికేషన్ తేదీ: 2026 అక్టోబర్ 15).
నాలుగో విడత: 2,995 పోస్టులు (నోటిఫికేషన్ తేదీ: 2026 అక్టోబర్ 15).

ఇప్పటికే తొలి దశ నోటిఫికేషన్ జారీ కాగా, మిగతా మూడు దశల వివరాలు ఇవిగో!

రెండో విడత: 3,231 పోస్టులు (నోటిఫికేషన్: 2026 సెప్టెంబర్ 15) 
సెప్టెంబర్‌లో జారీ చేయనున్న ఈ నోటిఫికేషన్‌లో గ్రూప్-1 సర్వీసులతో పాటు పోలీస్ శాఖలో అత్యధిక పోస్టులు ఉన్నాయి.

సెప్టెంబర్‌లో జారీ చేయనున్న ఈ నోటిఫికేషన్‌లో గ్రూప్-1 సర్వీసులతో పాటు పోలీస్ శాఖలో అత్యధిక పోస్టులు ఉన్నాయి.

గ్రూప్-1 సర్వీసులు (149 పోస్టులు): డిప్యూటీ కలెక్టర్: 11 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ): 36 అసిస్టెంట్ కమిషనర్ (ఎస్టీ): 14 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II: 12 డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 35 డిప్యూటీ రిజిస్ట్రార్ (సహకార శాఖ): 10

ఇతర కీలక పోస్టులు (3,082): పోలీస్ శాఖ: సివిల్ ఎస్సై (182), ఏఆర్ ఎస్సై (116), సివిల్ కానిస్టేబుల్స్ (542), ఏఆర్ కానిస్టేబుల్స్ (205), కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ (200), ఏపీఎస్పీ ఎస్సై (71), ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ (80) సహా మొత్తం 1,500కు పైగా పోస్టులున్నాయి. 

ఇతర శాఖలు: వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (164), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (196), ఫైర్‌మెన్ (158), జైలు వార్డర్లు (171), హార్టికల్చర్ ఆఫీసర్ (45), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III (దేవాదాయ శాఖ) (104).

మూడో విడత: 2,311 పోస్టులు (నోటిఫికేషన్: 2026 అక్టోబర్ 15) 
ఈ దశలో గ్రూప్-2, ఇంజనీరింగ్, ప్రొహిబిషన్ శాఖల్లోని కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు.

గ్రూప్-2 సర్వీసులు (673 పోస్టులు): డిప్యూటీ తహశీల్దార్: 200 డిప్యూటీ మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 176 గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ (జీఎస్టీఓ): 40 ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్: 25 సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II: 7 సచివాలయం, హెచ్‌ఓడీలలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, అకౌంటెంట్లు.

ఇంజనీరింగ్, ఇతర పోస్టులు (1,638): అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఏఈఈ): ఇరిగేషన్ (224), పంచాయతీరాజ్ (100), గ్రామీణ నీటి సరఫరా (73), ఆర్&బీ (75) సహా పలు శాఖల్లో మొత్తం 428 పోస్టులు. 

విద్యుత్ సంస్థల్లో ఏఈఈలు: ఏపీ ట్రాన్స్‌కో (200), ఏపీ జెన్‌కో (100), డిస్కంలు (మొత్తం 329) కలిపి 629 పోస్టులు. 

ఇతరాలు: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కానిస్టేబుల్ (400), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (50).

నాలుగో విడత: 2,995 పోస్టులు (నోటిఫికేషన్: 2026 అక్టోబర్ 15) 
ఈ విడత దాదాపు పూర్తిగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి (మెగా డీఎస్సీ) కేటాయించారు.

పాఠశాల విద్యా శాఖ (2,991 పోస్టులు): సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్లు, ఇన్‌స్ట్రక్టర్లు, డీఈవో పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను సంబంధిత డీఎస్సీ నోటిఫికేషన్‌లో ప్రకటిస్తారు.

వయోజన విద్య: అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 4 ఉన్నాయి.

ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, సంబంధిత శాఖలు వెంటనే ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్లు, అర్హతలకు సంబంధించిన సమాచారాన్ని నియామక సంస్థలకు అందించాలని ఆదేశించారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రిజర్వేషన్ పాలసీ, సర్వీస్ రూల్స్‌ను కచ్చితంగా పాటిస్తూ నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ భారీస్థాయి నియామక ప్రకటనతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులలో కొత్త ఆశలు చిగురించాయి