National

నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికుల గల్లంతు.. తీవ్ర ఆందోళన..

హిమాలయ దేశం నేపాల్‌లో సంభవించిన జల ప్రళయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. విహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి వెళ్లిన 156 మంది బృందంలోని 140 మంది ఆచూకీ తెలియకపోవడమే ఇందుకు కారణం. భోటేకోశీ నదికి బుధవారం ఆకస్మికంగా పోటెత్తిన వరదల కారణంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 95 మంది మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారని ప్రాథమిక సమాచారం అందుతోంది.

వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు టూర్ ఏజెన్సీ ద్వారా 156 మంది తెలుగు యాత్రికులు నేపాల్ పర్యటనకు వెళ్లారు. యాత్రికుల బృందం అక్కడి హోటల్‌లో బస చేసింది. అయితే, వీరిలో 140 మంది స్థల సందర్శన కోసం హోటల్ నుంచి బయటకు వెళ్లగా, అనారోగ్య కారణాల వల్ల 16 మంది గదులకే పరిమితమయ్యారు. సరిగ్గా అదే సమయంలో భోటేకోశీ నదికి భారీ వరదలు సంభవించాయి.

దీంతో బయటకు వెళ్లిన 140 మందితో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. హోటల్‌లోనే ఉండిపోయిన 16 మంది మాత్రం సురక్షితంగా ఉన్నారని తెలిసింది. గదిలోనే ఉండిపోయిన వారిలో నలుగురు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన వారని గుర్తించారు.

నేపాల్ వరద విపత్తు, అందులో తెలుగు యాత్రికులు గల్లంతైన వార్త తెలియడంతో తెలుగు రాష్ట్రాల్లోని వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. తమ వారి ఆచూకీ కోసం వారు టూర్ ఏజెన్సీని, అధికారులను సంప్రదిస్తున్నారు. గల్లంతైన వారిని సురక్షితంగా గుర్తించేందుకు సహాయక చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.