AP

వెలిగొండ ప్రాజెక్టుపై క్రెడిట్ చోరీ మొదలు..! ఎక్స్ వేదికగా కొన్ని విషయాలు బయటపెట్టిన జగన్..

ఏపీలో మళ్లీ క్రెడిట్ చోరీ మొదలైందా? కూటమి ప్రభుత్వంలో చేసిన ప్రతీ పని తమ ఘనతేనని చెప్పుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోందా? నిన్న భోగాపురం ఎయిర్‌పోర్టు.. నేడు వెలిగొండ ప్రాజెక్టు.. రేపు పోలవరం ప్రాజెక్టు. కూటమి ప్రభుత్వం ఏది చేసినా తాము చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తోందా? ఇంతకీ వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్  వైఎస్ ఖాతాలోకి వైసీపీ జమ చేసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఏపీలో మళ్లీ క్రెడిట్ చోరీ వ్యవహారం వార్తల్లోకి వచ్చింది. వెలిగొండ ప్రాజెక్టు తొలిఫేజ్‌ను సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. దీన్ని పసిగట్టిన వైసీపీ, నేరుగా జగన్ రంగంలోకి దిగేశారు. ఈ క్రెడిట్ కూడా మాదేనని చెప్పే ప్రయత్నం చేశారు మాజీ సీఎం జగన్. ఈ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.

వెలిగొండ ప్రాజెక్టు వైఎస్ చిరకాల స్వప్నమని, ఇప్పుడు సాకారం కావటం సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం, నేడు కృష్ణా జలాలు ప్రవహించడం ఎంతో సంతృప్తినిస్తోందని మనసులోని మాట బయటపెట్టారు. ఫ్లోరోసిస్‌తో బాధపడిన లక్షలాది కుటుంబాలకు వెలిగొండ ఓ సంజీవనిగా అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చేస్తున్న హడావిడి ముమ్మాటికీ క్రెడిట్ చోరీ ప్రయత్నాలని తనదైన శైలిలో విమర్శించారు. అంతేకాదు దానికి సంబంధించిన డీటేల్స్ కూడా బయటపెట్టారు మాజీ సీఎం జగన్.  వెలిగొండ ప్రాజెక్టు చరిత్ర కేవలం శిలాఫలకం మాత్రమే మీదని, సంకల్పం-నిర్మాణం వైయస్సార్‌ ఘనత అని తండ్రి ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు జగన్.

వైసీపీ ప్రభుత్వంలో జంట సొరంగాల పూర్తి చేశామని, ఇప్పుడు చేస్తున్నది క్రెడిట్‌ చోరీ అంటూ జగన్ రాసుకొచ్చారు. 1996 లో ఎన్నిక‌ల ముందు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారని, 2004 వరకు ఆ ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. ఆ ఎనిమిదేళ్లలో చంద్రబాబు సర్కారు ప్రాజెక్టు కోసం కేవలం రూ.10 లక్షలు ఖర్చు చేశారని, అది కూడా శంకుస్థాపన-సభకు మాత్రమేనని విమర్శించారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. జలయజ్ఞంలో భాగంగా వెలిగొండకు రూపమిచ్చారని వివరించారు. వెలిగొండకు ప్రాణం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాలన్న జగన్, అవి లేకుంటే కృష్ణా జలాలు వచ్చేవికావన్నారు. వైఎస్ఆర్ హయాంలో 20.333 కిలోమీటర్లు పూర్తి అయ్యిందన్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో కేవలం 6.686 కిలోమీటర్ల నిర్మాణం జరిగిందన్నారు.

వైసీపీ హయాంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 10.568 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తి చేశామని వివరించారు. 2021 జనవరిలో టన్నెల్‌-1ను పూర్తి చేశామని, 2024 జనవరిలో టన్నెల్‌-2 ను పూర్తి చేసిన ఘటన వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. 2024 మార్చిలో జంట సొరంగాలను జాతికి అంకితం చేశామని ఈ సందర్బంగా గుర్తు చేశారు మాజీ సీఎం. మొత్తం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటుందని ప్రశ్నలు రైజ్ చేశారు. ఎలాంటి కాంట్రిబ్యూషన్‌ లేకుండా క్రెడిట్‌ను కాజేయాలనుకోవడం చంద్రబాబు నైజానికి మరొక నిదర్శనమని అన్నారు.

జంట సొరంగాలను 2024లో పూర్తి చేస్తే.. 26 నెలలపాటు నిర్వాసితుల పునరావాసాన్ని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న లేవనెత్తారు. రెండేళ్లపాటు ప్రజలకు అందాల్సిన సాగు-తాగునీటి ప్రయోజనాలను ఆలస్యం చేశారని, నిర్వాసితుల‌కు ఆర్అండ్ఆర్‌ ప్యాకేజీని పూర్తిగా చెల్లించ‌లేదన్నారు. వంద‌లాది కుటుంబాలు త‌మ‌కు పున‌రావాస ప్యాకేజీ కింద అందాల్సిన డ‌బ్బులు అంద‌లేద‌ని, బ‌ల‌వంతంగా ఊళ్లు ఖాళీ చేయిస్తున్నార‌ని రాసుకొచ్చారు. ఇప్పటికైనా ప్రచారాన్ని ఆపి, నల్లమలసాగర్‌ను నింపి రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలని కోరారు వైసీపీ అధినేత జగన్.