AP

పోలవరం జిల్లాలో విషాద ఘటన..! వికటించిన మాత్రలు..! ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత..

పోలవరం జిల్లా గొల్లగుప్పలో విషాదం చోటు చేసుకుంది. వేసుకున్న మలేరియా మాత్రలు వికటించాయి. ఫలితంగా ఓ చిన్నారి మృతి చెందింది. మరో 53 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందర్ని వివిధ ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారు కోలుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది?

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మంగళవారం మెడికల్ క్యాంపులు నిర్వహించారు. అందులో మలేరియా నివారణకు స్థానిక పాఠశాల, అంగన్‌వాడీ చిన్నారుల్లో 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు ఇచ్చారు అధికారులు. మాత్రలు తీసుకున్నవారిలో పాఠశాల విద్యార్థులు ఉన్నారు. వారికి దగ్గరుండి వాటిని వేయించారు అధికారులు. ఆ గ్రామానికి చెందిన ఏడేళ్లు చిన్నారి పాఠశాలలో ఇచ్చిన మాత్రలు వేసుకుని ఇంటికి వెళ్లింది. ఇంటి వద్ద వాంతులు చేసుకుంది. వెంటనే చిన్నారిని లక్ష్మీపురం ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. చిన్నారి మూడు మాత్రలు వేసుకున్నట్లు చెబుతున్నారు.

గొల్లగుప్పలో పాఠశాల, అంగన్ వాడీ చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందర్ని లక్ష్మీపురం పీహెచ్సీకి, మరికొందర్ని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చిన్నారులంతా రెండేళ్ల నుంచి 10 ఏళ్లు వారే ఉన్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఈ ఘటన వెనుక కారణాలు తెలుసుకోవడం, సహాయచర్యల కోసం రాజమండ్రి, కాకినాడ, పాడేరు, విజయవాడకు రాపిడ్ రెస్పాన్స్ బృందాలను అక్కడికి తరలించారు. పంపిణీ చేసిన మాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? అనేదానిపై లోతుగా వివరాలు సేకరిస్తోంది.

వైరల్ ఫీవర్ సీజన్ కావడంతో అధికారులు మెడికల్ క్యాంపు నిర్వహించి మలేరియా నివారణకు చెందిన మాత్రలు ఇచ్చినట్టు తెలిసిందన్నారు జిల్లా మెడికల్ అధికారి రాజశేఖర్. చికిత్స పొందుతున్నవారిలో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 45 మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటన చేశారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న చింతూరు ఎస్పీ, ఐటీడీఏ పీవోలు వైద్యులతో మాట్లాడి పరిస్థితిపై వివరాలు సేకరిస్తున్నారు. టాబ్లెట్ల వల్లే మృతి చెందారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేకోణంలో ఆరా తీస్తున్నారు అధికారులు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సీఎం చంద్రబాబు జిల్లా అధికారులను ఆదేశించారు.  బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.