AP

చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా..?

బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను అలియాస్ మజ్జి శ్రీనివాసరావు.. వైసీపీకి గుడ్‌బై చెప్పాక.. ఉత్తరాంధ్రలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయ్. విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలకు కూడా  రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ముందు.. ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు అసలు పోరు మొదలైంది. భీమిలి ఇన్‌చార్జి పదవి కోసం.. పోటీ పెరిగింది. ఎందుకంటే.. ఇది వైసీపీకి కీలక స్థానం. గత ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు 92 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయనకు దీటైన నేత కావాలంటే.. బలమైన అభ్యర్థి తప్పనిసరి అని పార్టీ భావిస్తోంది. అందుకే ఇప్పుడు ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. సీనియర్ నేతల నుంచి కిందిస్థాయి క్యాడర్ దాకా.. అందరూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రుల ద్వారా జగన్‌ను కలిసి ఛాన్స్ అడుగుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతల ఇళ్ల ముందు.. విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి ఆశావహులు క్యూ కడుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కోసం పార్టీ సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతమంది ఆశావహుల్లో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిమీదే చర్చ నడుస్తోంది. మరి.. గంటా శ్రీనివాసరావుని ఢీకొట్టే నేత ఎవరు? జగన్ చూపు ఎవరిపై పడుతుంది? భీమిలి వైసీపీ కొత్త ఇన్‌చార్జి పేరు ప్రకటన కోసం.. ఉత్తరాంధ్ర అంతటా ఉత్కంఠ నెలకొంది.