TELANGANA

సెమీకండక్టర్ రంగానికి రెడ్ కార్పెట్.. సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ..

భవిష్యత్తు ప్రపంచ సాంకేతిక రంగాన్ని, కృత్రిమ మేధస్సు విప్లవాన్ని శాసించబోతున్న సెమీకండక్టర్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే వ్యూహంలో భాగంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్ పరికరాలు, చిప్ డిజైనింగ్, తయారీ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.

ఈ బృహత్తర ప్రణాళికలో భాగంగా, తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ బృందం ప్రకటించింది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి (ఇంధన, వాణిజ్య విభాగం) అగస్టిన్ లీ నేతృత్వంలోని బృందం భేటీ అయి విస్తృతంగా చర్చలు జరిపింది.

రాష్ట్రంలో అత్యాధునిక మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని, ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ పరిశ్రమలకు పూర్తి స్థాయిలో అనుమతులు, సబ్సిడీలు, సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను కేవలం పర్యాటక రంగంలోనే కాకుండా అంతర్జాతీయ నాలెడ్జ్ హబ్‌గా మారుస్తున్నామని స్పష్టం చేశారు. నెట్-జీరో కార్బన్ విధానంతో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ, తొలిదశ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, నైట్ ఎకానమీ ప్రణాళికలను సింగపూర్ బృందానికి వివరించారు.

ఇప్పటికే హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు తమ ఆఫ్-షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాబోయే డిసెంబరు నెలలో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు సింగపూర్ బృందాన్ని సీఎం అధికారికంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు.