TELANGANA

అనర్హత తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్..

ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును దానం నాగేందర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్‌‍పీ) దాఖలు చేశారు.

బీఆర్ఎస్ తరపున గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై శుక్రవారం హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం విదితమే. సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

ఈ అనర్హత 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే వర్తిస్తుందని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ గతంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా పరిగణించాలని, తీర్పు ప్రతులను స్పీకర్ కార్యాలయానికి, ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు, ఇదే వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అంశంపై తమ వాదనలు వినకుండా ఎలాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకోవద్దని వారు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.