తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వేములవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు ప్రజాసేవ చేసేందుకు తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. వారి రాకతో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
పర్యటనలో భాగంగా, వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కవిత పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణంలో కాంక్రీట్ వాడటాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఆగమశాస్త్రం ప్రకారం కృష్ణశిలలతో నిర్మిస్తేనే ఆలయం వందల ఏళ్లపాటు నిలుస్తుందని, చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. భక్తులు సమర్పించిన గోవులు సరైన మేత, నీరు లేక మరణిస్తున్నాయని, వాటికి కనీసం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు కూడా జరపడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“అడవిని వదిలేసి వచ్చిన మాజీ మావోయిస్టులు ప్రజా జీవితంలోకి రండి.. మా పార్టీ మీకు మంచి ప్లాట్‌ఫామ్” అని కవిత పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా సిరిసిల్ల-వేములవాడ ప్రాంతంలో సాగునీటి పనులు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిశానిర్దేశం కోల్పోయిందని, అందుకే ప్రజలు తమలాంటి కొత్త పార్టీల వైపు చూస్తున్నారని విమర్శించారు. అంతకుముందు, ఆమె శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

