స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రేపో మాపో రానుంది. దీంతో వివిధ పార్టీల తరపున అభ్యర్థుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ మేయర్ రేసులో అధికార-విపక్షాల నుంచి బలమైన అభ్యర్థులు రేసులో ఉన్నారు. వారిలో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఏపీలోని కీలకమైన నగరాల్లో మేయర్ పీఠం ఎవరి వశం కానుంది. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో కాస్త పాత తరం, కొత్త తరం నేతలు, మహిళలు పోటీ పడుతున్నారు. అన్నింటి కంటే ముందుగా విశాఖ సిటీ మేయర్ పీఠం విషయానికి వద్దాం. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్- జీవీఎంసీ మేయర్ పీఠం రిజర్వేషన్ ఖరారు కావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈసారి ఆ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. సామాజిక సమీకరణాలను లెక్కలు వేసుకుంటూ గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డాయి.
సోషల్ మీడియాలో పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కూటమి తరపున నటుడు బాలకృష్ణ రెండో కూతురు, విశాఖ ఎంపీ భరత్ వైఫ్ తేజస్విని పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పుడొస్తున్న తరానికి ఆమె అయితే బెటరని అంటున్నారు. నగరంలోని కీలక నేతలంతా ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తేజస్వినితోపాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భార్య లావణ్య పేరు తెరపైకి వచ్చింది. అలాగే మాజీ కార్పొరేటర్ ముక్కా శ్రావణి, ఓ వ్యాపారవేత్త కుమార్తె పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అభ్యర్థుల జాబితా టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఉన్నట్లు సమాచారం.
టీడీపీ నుంచి కాకుండా వైసీపీ నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ పేరు వినిపిస్తోంది. గతంలో ఆమె విజయనగరం జెడ్పీ ఛైర్మన్, ఎంపీగా పని చేసిన అనుభవం ఉంది. మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భార్య హిమగౌరి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, అనకాపల్లి మాజీ ఎంపీ సత్యవతి పేర్లు రేసులో ఉన్నాయి. ప్రత్యర్థి ఎవరనేది పరిశీలించి అభ్యర్థిని నిలబెట్టాలన్నది వైసీపీ ఆలోచన.
గ్రేటర్ విశాఖ మేయర్ చరిత్రలో ఇద్దరు మహిళలు బాధ్యతలు నిర్వర్తించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ తరఫున రాజాన రమణి- 2000-05 మేయర్‌గా ఉన్నారు. అప్పటికి ఇంకా గ్రేటర్ విశాఖ ఏర్పడలేదు. ఆ తర్వాత 2021 నుంచి వైసీపీ తరఫున హరి వెంకటకుమారి మేయర్‌గా పని చేశారు. ఈసారి తాజా రిజర్వేషన్‌తో విశాఖకు మూడో మహిళ మేయర్‌గా రానున్నారు. ఏపీలోని మిగతా నగరాల కంటే అందరి చూపు విశాఖ మేయర్ సీటుపై పడింది. ఈ కుర్చీని ఏ పార్టీ, ఏ వ్యక్తి దక్కించుకుంటారో చూడాలి.

