TELANGANA

ఎల్‌నినో ఎఫెక్ట్..! యాసంగిలో వరి సాగు వద్దు.. ఆరుతడి పంటలే ముద్దు: మంత్రి తుమ్మల..

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయడంతో పాటు, ప్రస్తుత పంటలను కాపాడేందుకు, రానున్న యాసంగి సీజన్‌లో నష్టాలను నివారించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, రైతులతో నిర్వహించిన సదస్సులో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి తుమ్మల పాల్గొని ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, యాసంగి పంటల ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలన్నారు. సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందజేస్తున్నామని తెలిపారు. నీటి లభ్యత ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించాలన్నారు. రైతులకు అర్థమయ్యే భాషలో, వాస్తవ పరిస్థితులను వివరించి చెబితే వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు. క్షేత్రస్థాయి పరిస్థితులను దాచకుండా తెలియజేయాలి. రైతులు నష్టపోకుండా సరైన పంటల ఎంపిక చేసుకునేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. రైతులను అప్రమత్తం చేయాలి.. నష్టాలను నివారించాలన్నారు.

ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో, ఈ పరిస్థితులను కూడా ప్రతిపక్షాలు తమ రాజకీయ స్వ లాభం కోసం ఉపయోగించుకుంటున్నాయని మంత్రి విమర్శించారు. రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలని, రైతుల్లో అనవసర ఆందోళన కలిగించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సంజయ్ జాజు, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వివిధ శాఖల కార్యదర్శులు, డైరెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన శాఖ వైస్ ఛాన్స్ లర్లు, శాస్త్రవేత్తలు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1600 రైతు వేదికల నుండి వేలాది మంది రైతులు పాల్గొన్నారు