వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి జిల్లా పరిషత్ ఎన్నికల్లో తొలి ఎదురుదెబ్బ తగిలింది. పూసపాటిరేగ మండలం జడ్పీటీసీ స్థానానికి వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన బొత్స సత్యనారాయణ సోదరుడి కుమారుడు బొత్స చైతన్య నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈరోజు తిరస్కరించారు.
నామినేషన్ల పరిశీలన సందర్భంగా, బొత్స చైతన్య అర్హతపై జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కోట్ల రేవతి రాతపూర్వకంగా అభ్యంతరం తెలిపారు. చైతన్యకు విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని 41వ వార్డులో ఓటు హక్కు ఉందని, ఆయన స్థానికేతరుడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో పాటు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి, చైతన్య నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, పార్టీ న్యాయవాదులు వెంటనే ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌ను కలిసి అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌పై కలెక్టర్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. ఒకవేళ ఈ తిరస్కరణ ఖరారైతే, పూసపాటిరేగ జడ్పీటీసీ బరిలో వైసీపీకి అభ్యర్థి లేకుండా పోయే అవకాశం ఉంది

