National

మూడేళ్ల తర్వాత భారత్‌లో పాకిస్థాన్ మంత్రి పర్యటన..

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు పాకిస్థాన్ పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ హాజరుకానున్నారు. నవంబర్ 20 నుంచి 22 వరకు జరగనున్న ‘ఎస్‌సీవో సివిలైజేషనల్ డైలాగ్’ (నాగరికతల సంభాషణ)లో ఆయన పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

గత మూడేళ్లకు పైగా కాలంలో పాకిస్థాన్‌కు చెందిన ఒక కేంద్ర మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇంతకుముందు 2023 మే నెలలో గోవా వేదికగా జరిగిన ఎస్‌సీవో విదేశాంగ మంత్రుల సదస్సు కోసం అప్పటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌కు వచ్చారు. ఆ పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి రాజకీయ లేదా అధికారిక పర్యటనలు పెద్దగా జరగలేదు.

ఈ తాజా పర్యటనపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఎస్‌సీవో వేదికగా వివిధ నాగరికతలు, సంస్కృతుల మధ్య నిర్మాణాత్మక చర్చలను ప్రోత్సహించడానికి, సభ్యదేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పరస్పర గౌరవం, సద్భావనతో కూడిన వాతావరణంలో ఈ చర్చలను ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించింది.

న్యూఢిల్లీ వేదికగా జరగనున్న ఈ ఎస్‌సీవో సదస్సు ద్వారా సభ్యదేశాల మధ్య సాంస్కృతిక, పర్యావరణ, పరస్పర సహకార అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ మంత్రి పర్యటన దౌత్యపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.