National

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ ఖతం..!

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాది లతీఫ్ భట్ హతమయ్యాడు. నవంబర్ 11న అఖ్రాన్ ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) చెక్‌పోస్టుపై జరిగిన దాడిలో ఇతను కీలక నిందితుడు కావడం గమనార్హం. మసీదులో నక్కిన లతీఫ్ ను తొలుత లొంగిపోవాలని భద్రతా దళాలు కోరాయి. అయితే భట్ ఇందుకు భట్ నిరాకరించి.. ఫైరింగ్ జరపడంతో ఎదురుకాల్పుల్లో అతడు మరణించినట్లు భద్రతా బలగాలు స్పష్టం చేశాయి.

కాగా నవంబర్ 11న లతీఫ్ జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఈ దాడిలో లతీఫ్ కు సహకరించిన అతడి సహచరుడు ఉమర్ నిసార్ దార్ ను సోమవారమే భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే బలగాలపై దాడి అనంతరం వీరిద్దరు బైక్ పై తప్పించుకొని పారిపోగా.. వీరికోసం పెద్ద ఎత్తున అధికారులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇద్దరు ముష్కరుల ఆచూకీ కోసం దాదాపు 500 మందికి పైగా స్థానికులను విచారించి ఉగ్రవాదుల వారు దాక్కున్న ప్రాంతాన్ని గుర్తించారు. సోమవారం లతీఫ్ అనుచరుడు, ఇవాళ సూత్రధారుడ్ని లేపేసి బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి.

లతీఫ్ ఎన్ కౌంటర్ విషయానికి తెల్లవారుజామున 2:45 గంటల ప్రాంతంలోనే అతడ్ని పట్టుకునేందుకు బలగాలు యత్నించారు. తొలుత అతడితో వీడియో కాల్‌లో మాట్లాడి లొంగిపోవాలని కోరారు. ‘నీకు ఎలాంటి హానీ తలపెట్టం. లొంగిపోతే నీకే మంచిది’ అని ఒక పోలీస్ అధికారి లతీఫ్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అతడు అందుకు ససేమిరా అన్నాడు. ‘నేను అల్లాను కలవాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను’ అని సమాధానమిచ్చి కాల్ కట్ చేశాడు

ఈ విషయంపై సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) అనాయత్ అలీ మాట్లాడుతూ.. లతీఫ్ ను లొంగిపోయేలా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని తెలిపారు. ‘నేను స్వయంగా అతనితో వీడియో కాల్‌లో చాలా సేపు మాట్లాడాను. నీ వయసు చాలా చిన్నది. ముందు చాలా జీవితం ఉందని నచ్చజెప్పాము. మసీదు బయట నుంచి మైకుల ద్వారా కూడా ప్రకటనలు చేశాము. కానీ అతను వినలేదు’ అని వివరించారు. తెల్లవారుజామున 2:45 గంటలకు లతీఫ్ మసీదు లోపలి నుంచే భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు అనివార్యమయ్యాయని ఆయన తెలిపారు. మసీదు పవిత్రతకు భంగం కలగకుండా భద్రతా దళాలు అత్యంత సంయమనంతో వ్యవహరించాయని ఆయన స్పష్టం చేశారు.

ఉగ్రవాదిగా మారిన లతీఫ్ భట్ గతంలోనూ పలు దాడుల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. జులై 22న అనంతనాగ్‌లో పోలీసులపై జరిగిన ఉగ్రదాడిలో ఇతని ప్రమేయం ఉందని పేర్కొన్నారు. ఆ ఘటనలో ఒక పోలీసు అమరుడైనట్లు తెలిపారు. అలాగే ఆగస్టు 1న కుల్గాంలో ఇద్దరు వలస కార్మికుల హత్య వెనుక కూడా లతీఫ్ భట్ హస్తం ఉన్నట్లు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి.