AP

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..! రేషన్ షాపుల్లో తక్కువ ధరకే సరుకులు..

నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ ఏపీ ప్రభుత్వం సామాన్యులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ధరల భారం పడకుండా చూసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ధరల నియంత్రణకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

డిసెంబర్ మొదటి వారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా రాయితీపై నిత్యావసరాలను అందించాలని సీఎం స్పష్టం చేశారు. దీని ప్రకారం, బయట మార్కెట్‌తో పోలిస్తే చాలా తక్కువగా కిలో కందిపప్పును రూ.100కే, లీటరు పామాయిల్‌ను రూ.125కే ప్రజలకు విక్రయించనున్నారు. అంతేకాకుండా, సామాన్యులకు బియ్యం అందుబాటులో ఉండేలా ప్రస్తుతం ఉన్న 286 ధరణి బియ్యం విక్రయ కేంద్రాలను ఏకంగా 500కు పెంచాలని అధికారులకు సూచించారు.

కృత్రిమ కొరత సృష్టించి, సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై నిఘా పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై ఎలాంటి మొహమాటం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ నిర్ణయాలతో రానున్న రోజుల్లో సామాన్యుల వంటింటి బడ్జెట్‌కు కాస్త ఉపశమనం లభించనుంది.