పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం జరక్కుండా త్వరలోనే సమగ్రమైన పాలసీతో సింగిల్ విండో విధానం అమలులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పౌల్ట్రీ పరిశ్రమాభివృద్ధికి సంబంధించి తగిన ప్రతిపాదనలతో వస్తే భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన భూమి కేటాయిస్తామని హామీఇచ్చారు.హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో – 2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇండియన్ పౌల్ట్రీ ఈక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే ఈ ఎక్స్‌పోలో వివిధ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రదర్శిస్తున్నాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ స్థాపించుకోవడానికి అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్ లాంటి విషయాల్లో చాలా సమయం పడుతుందని తన దృష్టికి తెచ్చారని గుర్తుచేస్తూ, పట్టణాల్లో బిల్డ్‌నౌ యాప్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్న పద్ధతిని త్వరలోనే గ్రామాలకు విస్తరిస్తామని హామీ ఇచ్చారు.డిసెంబర్ 7 నుంచి 9 తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 సందర్భంగా ప్రతిపాదనలతో వస్తే ఫ్యూచర్ సిటీలో పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమైన అద్భుతమైన కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రతినిధులకు సూచించారు.అలాగే, పౌల్ట్రీ ఎల్లకాలం లాభసాటి కాకపోవచ్చని, కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో మొక్కజొన్న, సోయాబీన్ వంటి ఫీడ్ కోసం ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని చెప్పారు. పరిశ్రమను కాపాడటాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులను ముఖ్యమంత్రి ఉటంకిస్తూ, రాష్ట్రంలో ఆహార ధాన్యాలు తగినన్ని నిల్వలు ఉన్నాయని, పౌర సరఫరాల శాఖ వద్ద ఉన్న బఫర్ స్టాక్ ఉందని తెలియజేస్తూ.. మొక్కజొన్న, సోయాబీన్ వ్యాపారులకు బహిరంగ మార్కెట్లో కాకుండా అవసరమైన మేరకు పౌల్ట్రీ పరిశ్రమకు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వం వద్ద బఫర్ స్టాక్ ఎంతుంది.. ఏ రకంగా ఆదుకోగలం.. ఏ ధరకు ఇవ్వగలమన్న విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తో కలిసి సమీక్షించి 48 గంటల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వేదికపైన ఉన్న మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రైతులు, రైతు కూలీలకు ఎంతో ఉపయోగపడుతుందని, రైతులు పండించే మొక్కజొన్న, సోయా లాంటి పంటలతో పాటు నూకలు, తౌడు వంటి బై ప్రొడక్టులను కొనుగోలు చేస్తూ రైతులకు సంపూర్ణమైన సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు.గుడ్లు, కోళ్లను పెంచడం ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని, యువశక్తికి ప్రొటీన్ ఇవ్వగలిగే పరిశ్రమలను నడుపుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 5.30 కోట్ల గుడ్లను ఉత్పత్తి చేస్తూ, యువశక్తిని ప్రొటీన్ అందిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో వారంలో 3 గుడ్లు, మంచి చికెన్‌తో భోజనాలు పెట్టి పౌల్ట్రీ పరిశ్రమ సహకారంతో పౌష్టికాహారాన్ని అందించగలుగుతున్నామని చెప్పారు.18 సంవత్సరాలుగా పౌల్ట్రీ, మీట్ ఎక్స్పోను హైదరాబాద్‌లో నిర్వహించడం, అత్యధికంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించి మొదటి స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి ప్రతినిధులను అభినందించారు.
అదే సీఎం లక్ష్యం..
ఐటీ, ఫార్మా, డిఫెన్స్ పరిశ్రమలతో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లతో పాటు పౌల్ట్రీ పరిశ్రమను కూడా ప్రాధాన్యత రంగంగా ప్రభుత్వం గుర్తించడమే కాకుండా పౌల్ట్రీ సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం పనిచేసేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదని, గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ముఖ్యమంత్రులు అమలు చేసిన మంచి విధానాలను యథాతథంగా కొనసాగిస్తూనే వాటిని మరింత మెరుగ్గా అమలు చేస్తున్నామని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలు మారుతున్నాయని, పెట్టుబడిదారులకు తమ పెట్టుబడులపై గ్యారెంటీ లేదని, తెలంగాణలో అలా కాదని వివరిస్తూ పరిశ్రమలకు సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. దేశంలో 2.5 శాతం జనాభా ఉన్న తెలంగాణ ప్రస్తుతం దేశ జీడీపీలో 5 శాతం మేరకు కంట్రిబ్యూట్ చేస్తోందని, ఆ వాటాను 10 శాతానికి పెంచాలన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు.
వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ వంతుగా 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదగాలని నిర్దేశించుకున్నట్టు వివరించారు.నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెబుతూ, పౌల్ట్రీ రంగాన్ని అన్ని విధాలుగా సహకరిస్తామని, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పౌల్ట్రీ రంగానికి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని, పెట్టుబడులకు రక్షణ ఉంటుందని భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి , ఎంపీ వేం నరేందర్ రెడ్డి , రఘువీర్ రెడ్డి , పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ , మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి , ఐపీఈఏ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ తో పాటు అసోసియేషన్ ప్రతినిధులు, పౌల్ట్రీ రంగానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.

