AP

ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి

ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి పెరుగుతోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరవుతున్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు.

తమ గడప వద్దకు రావద్దని ముఖం మీద తలుపులు వేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక వైసిపి ప్రజాప్రతినిధులకు పాలు పోవడం లేదు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే ఓడిపోవాలని సొంత పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేయడం విశేషం. సదరు ఎమ్మెల్యే ఆ గ్రామంలో ఉండగానే ఈ ఘటన జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పీజేఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉప్పుగుండూరులో పర్యటించారు. అయితే కార్యక్రమాన్ని సొంత పార్టీ శ్రేణులే బహిష్కరించాయి. ఎమ్మెల్యే ఇంటింటికీ తిరుగుతుండగానే అదే పార్టీకి చెందిన కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక పోలేరమ్మ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సుధాకర్ బాబు ఓడిపోవాలని మొక్కుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది.

గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుధాకర్ బాబుకు ఈ గ్రామస్తులు ఏకపక్షంగా మద్దతు తెలిపారు. ఆయన విజయానికి కృషి చేశారు. ఆయన గెలుపొందాలని ఇదే అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కానీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సుధాకర్ బాబు ఈ గ్రామాన్ని పట్టించుకోలేదు. పలుమార్లు వినతి పత్రాలు అందించినా స్పందించలేదు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహం నెలకొంది. అందుకే ఎమ్మెల్యే గ్రామానికి వచ్చిన సమయంలోనే నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఏకంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టి అమ్మవారి ఆలయంలో ఆయన ఓడిపోవాలని పూజలు చేశారు. అధికార వైసీపీలో ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.