AP

రానున్న ఎన్నికల్లో మరోసారి తాను విశాఖపట్నం నుంచే పోటీచేయనున్నట్లు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ

రానున్న ఎన్నికల్లో మరోసారి తాను విశాఖపట్నం నుంచే పోటీచేయనున్నట్లు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తే మూడు లక్షలకు పైగా ఓట్లు లభించాయని, అంతటి చైతన్యవంతమైన వైజాగ్ నుంచే మళ్లీ పోటీచేస్తానన్నారు.

గత ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి ఎంపీగా పోటీచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తనను రోజుకు రెండు మూడు పార్టీలవారు కలుస్తున్నారని చెప్పారు.

తన మిత్రులతో చర్చించి ఏ పార్టీ నుంచి పోటీచేయాలనే విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటానన్నారు. జమిలి ఎన్నికలు మంచివేనని, కానీ అమలు చేయాలంటే రాజ్యాంగంలో ఐదురకాల మార్పులు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జమిలి వల్ల ఎన్నికల ఖర్చు బాగా తగ్గుతందన్నారు. తెనాలి మండలం అత్తోటలో భూమి భారతి వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు.

అక్కడ రైతులతో కలిసి నాట్లు వేశారు. రాజ్యాంగంలో ఇండియాతోపాటు భారత్ అనే పేరుకూడా ఉందన్నారు. విదేశీయులు తెచ్చిన పేరును తీసేసి మన పేరును పెట్టుకుందామనే ఆలోచన పాలకులకు వచ్చివుండొచ్చన్నారు. ఇండియాను భారత్ గా మార్చడంలో ఎటువంటి తప్పు లేదని, కాకపోతే అసలు సమస్య పక్కదారి పట్టకుండా చూడాలన్నారు.

పిల్లలకు వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలని, వారికి వ్యవసాయాన్ని నేర్పించాలన్నారు. పాఠశాల పిల్లలకు వీటిగురించి తెలియజేసేందుకే ఇక్కడ నాట్లు వేసినట్లు వెల్లడించారు. రసాయన ఎరువులవల్ల ఆహారంలో కాలుష్యం పెరిగిపోయిందని, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయడంవల్ల రాబోయే తరాలవారికి ఎటువంటి కలుషితం లేని ఆహార పదార్థాలను అందిద్దామని పిలుపునిచ్చారు.