అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు..
తగిన సాక్ష్యాధారాలతో సహా.
ఈ తెల్లవారు జామున నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్ట్‌లో ఆయనను ప్రవేశపెట్టారు. ఈ అరెస్ట్ పట్ల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.
కొద్దిసేపటి తరువాత చంద్రబాబు వియ్యకుండు, ప్రముఖ నటుడు, టీడీపీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ, కోడలు నారా బ్రాహ్మణి.. సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట నందమూరి కుటుంబ సభ్యులు ఒకరిద్దరు ఉన్నారు. తొలుత గన్నవరం విమానాశ్రయం వద్ద కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు బాలకృష్ణ.
మరోవంక- జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా విజయవాడకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. తొలుత ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడానికి ప్రయత్నించినప్పటికీ.. తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్ ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇవ్వలేదు.
ఇంతా జరుగుతున్నప్పటికీ- నందమూరి కుటుంబ వారసుడు, చంద్రబాబు మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అర్ధరాత్రి వరకూ జూనియర్ ఎన్టీఆర్ ఊసే ఎక్కడా వినిపించలేదు. చంద్రబాబు అరెస్టుపై ఒక్కమాట కూడా ఆయన మాట్లాడలేదు. అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లోనూ ఎలాంటి పోస్టూ కనిపించలేదు.
గతంలో నారా భువనేశ్వరిపై వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేశారంటూ వార్తలు వచ్చినప్పుడు జూనియర్ స్పందించిన విషయం తెలిసిందే. ఓ వీడియోను సైతం ఆయన విడుదల చేశారు అప్పట్లో. చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి, ఓ మహిళపై విమర్శలు చేయడం అరాచక పాలనకు దారి తీసినట్టవుతుందంటూ మండిపడ్డారాయన.
నారా లోకేష్ కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు తారకరత్నం గుండెపోటుకు గురై బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడూ జూనియర్ ఎన్టీఆర్.. కుటుంబ సభ్యులతో కనిపించారు. కల్యాణ్ రామ్‌తో కలిసి బెంగళూరుకు వచ్చి మరీ కుటుంబానికి అండగా ఉన్నారు.
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మీద కేంద్ర ప్రభుత్వం వంద రూపాయల నాణేన్ని విడుదల చేసిన కార్యక్రమానికి గైర్హాజర్ అయ్యారు. ఆహ్వానం ఉన్నప్పటికీ.. ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. నారా కుటుంబంతో కలవడం ఇష్టం లేకపోవడం వల్లే ఢిల్లీ వెళ్లలేదనే ప్రచారం జరిగింది.
ఈ ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ మరింత బలపరిచినట్టే. చంద్రబాబు అరెస్టుపై ఇప్పటివరకూ ఆయన స్పందించలేదు. ట్వీట్ కూడా పోస్ట్ చేయలేదు. నారా కుటుంబానికి పూర్తిగా దూరం ఉంచినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. భువనేశ్వరి విషయంలో స్పందించిన జూనియర్.. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది.