టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం పై చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తూ పోరాటం చేస్తానంటున్న పవన్ కళ్యాణ్ పై వైసిపి మంత్రి సీదిరి అప్పలరాజు తనదైన శైలిలో మండిపడ్డారు.
అవినీతి బాబును అరెస్టు చేస్తే యుద్ధం చేస్తావా పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నించిన మంత్రి సీదిరి రాజకీయాలు పవన్ కళ్యాణ్ కు సూట్ కావని, వెళ్లి సినిమాలు చేసుకోవాల సీదిరి అప్పలరాజు విమర్శించారు.
గతంలో టిడిపి అవినీతిపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ అవన్నీ మరిచిపోయి ఇప్పుడు రోడ్డుపై డ్రామాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తీరుతో జనసైనికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఇంకెంతకాలం చంద్రబాబు జెండాను అజెండాగా తీసుకువెళతామని వాళ్ళు బాధపడుతున్నారని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. ప్యాకేజీ తీసుకొని పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడని విమర్శించారు.
చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకు పంపితే కన్న కొడుకు లోనే అంత ఆక్రోశం చూడలేదు కానీ దత్తపుత్రుడు ఓవరాక్షన్ చేశాడని మండిపడ్డారు. కన్నతల్లిని తిట్టినప్పుడు కూడా దత్తపుత్రుడు అంతగా ఓవరాక్షన్ చేయలేదని, తాను చేసే రీమేక్ సినిమాలలోనూ పవన్ కళ్యాణ్ అంత ఓవరాక్షన్ చేయలేదని ఎద్దేవా చేశారు. బాబు లాంటి అవినీతిపరుడుకి మద్దతు తెలిపే నిన్ను ప్రజలు ఎలా ఆదరిస్తారో చెప్పాలని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు.
ఎన్నికల్లో పోటీ చేసి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు.. ఇంకా ఇలాగే ఉంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఇక మరోవైపు చంద్రబాబు దేశంలోనే ఒక పెద్ద స్కిల్డ్ క్రిమినల్ అని, వ్యవస్థలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని, ప్రజల సొమ్మును కాజేసిన అవినీతిపరుడని మంత్రి సీదిరి అప్పలరాజు చంద్రబాబును టార్గెట్ చేశారు.
తాను వ్యవస్థలను ఎలాగైనా మేనేజ్ చేయగలనన్న అహంకారంతో చంద్రబాబు ఇంతకు దిగజారాడు అని, ఇప్పుడు సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నాడని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ప్రజల నుంచి ఎటువంటి సానుభూతి చంద్రబాబుకు రాలేదని, టీడీపీ బంద్ విఫలం అయ్యిందని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.