అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో నేడు పలు పిటీషన్లు వేర్వేరు న్యాయస్థానాల్లో విచారణకు రానున్నాయి. ఇందులో సుప్రీంకోర్టులో కూడా ఓ పిటీషన్ దాఖలైంది. అదీ ఇవ్వాళే లిస్ట్ అయింది. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంతో పాటు హైకోర్టు ముందు చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ జరుగనుంది.
ఏసీబీ కోర్టులో- స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బెయిల్ పిటిషన్, చంద్రబాబు కస్టడీని పొడిగించాలంటూ సీఐడీ అధికారులు వేసిన పిటిషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో వారు వేసిన పీటీ వారెంట్, ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో వేసిన మరో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు ఇవ్వాళ విచారించనుంది.
హైకోర్టులొ- ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. అదే సమయంలో ఫైబర్ గ్రిడ్ స్కాంలో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పైనా విచారణ జరుగనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగల్లులో పోలీసులపై దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్‌పైనా ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.
స్కిల్ స్కాంలో హైకోర్టు కొట్టేసిన క్వాష్ పిటిషన్ రివ్యూ చేయాలని చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ నేడే విచారణకు రానుంది. ఇదివరకు ఈ క్వాష్ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు.