విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ ప్రభుత్వంపై భారత్ రాష్ట్ర సమితి నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన విమర్శలను ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి తిప్పి కొట్టారు. దీక్షకు దిగడం పట్ల ఘాటు విమర్శలు చేశారు. గతంలో ఇదే మోత్కుపల్లి.. చంద్రబాబు అవినీతిపరుడంటూ అనేక ఆరోపణలు చేశారని గుర్తు చేశారు.
ఒకప్పుడు ఎన్టీఆర్‌ని చంపించింది చంద్రబాబేనంటూ ఆరోపించిన మోత్కుపల్లి ఇప్పుడు డబ్బు, ప్యాకేజీ కోసం చంద్రబాబుని పొగుడుతున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతి పరుడని, నయవంచకుడని గతంలో చేసిన విమర్శలను మోత్కుపల్లి మరిచిపోయినట్టున్నాడని గుర్తు చేశారు.
ఒకప్పుడు ఎన్టీఆర్‌ని చంపించింది చంద్రబాబు నాయుడేనని మాట్లాడిన మోత్కుపల్లి.. ఇప్పుడు డబ్బు, ప్యాకేజీ కోసం చంద్రబాబుని పొగుడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం, నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని నారాయణ స్వామి హెచ్చరించారు.
అవినీతిని కనిపెట్టింది చంద్రబాబేనని, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో కోట్ల రూపాయలను కొల్లగొట్టాడని అన్నారు. ఆయన పాపం పండి కటకటాల పాలయ్యాడని చెప్పారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి టీడీపీ చీఫ్‌గా వ్యవహరిస్తోన్నారని నారాయణ స్వామి విమర్శించారు. డబ్బు, పదవి కోసం ఆశపడి పురంధేశ్వరి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు.
సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే చంద్రబాబు అవినీతిపరుడని చెబుతోంటే.. చిన్నమ్మ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోన్నారని, బాబు సత్యహరిశ్చంద్రుడన్నట్టు మాట్లాడుతున్నారని చురకలు అంటించారు. పురంధేశ్వరి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.