AP

తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం.. ఆందోళనలో భక్తులు

తిరుమల నడక మార్గంలో ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు.. అయితే, వారిని చిరుతల సంచారం మరోసారి భయపెడుతోంది..

గతంలో ఓ బాలుడిపై దాడి చేయడం.. ఆ తర్వాత చిన్నారిని చిరుత చంపేయడంతో.. భక్తులు భయాందోళనకు గురయ్యారు.. దీంతో.. టీటీడీ, ఫారెస్ట్‌ అధికారులు ఉమ్మడిగా ఆపరేషన్‌ చిరుత చేపట్టారు.. ఇప్పటికే ఐదు చిరుతలను బంధించారు.. ఇక, చిరుతల పీడ విరగడైందని భక్తులు సంతోషపడుతున్నారు.. చాలా రోజులైంది చిరుతల సంచారం లేక.. కానీ, తాజాగా, అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించారు అధికారులు..

నరశింహస్వామి ఆలయం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరించినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.. గత మూడు రోజులుగా వేకువజాము, రాత్రి సమయంలో చిరుత, ఎలుగుబంటి కదలికలను తేల్చారు.. గతంలో దాడులు చేసిన ప్రాంతంలోనే రెండు చిరుతల సంచరించినట్టు చెబుతున్నారు.. దీంతో, భక్తుల భధ్రతను దృష్టిలో వుంచుకోని భధ్రతా సిబ్బందిని అప్రమత్తం చేసింది టీటీడీ.. నడకదారిలో వెళ్లే భక్తులు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికార్లు చెబుతున్నారు. కాగా, చిరుతల కదలికను గుర్తించేందుకు నడక మార్గంలో టీటీడీ ట్రాప్‌ కెమెరాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన విషయం విదితమే.. చిరుత కదలికలను గుర్తించి.. ఆ ప్రాంతంలో బోనులు ఏర్పాటు చేసి.. చిరుతలను బంధిస్తూ వస్తున్నారు.