ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై ఆది నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు..
అయితే, తాజాగా, తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు మరియు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు 3 పేజీల లేఖ రాయడంతో కలకలం రేగుతోంది.. అక్టోబర్ 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు పంపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను చంపాలని కొందరు కుట్ర పన్నుతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.. దీంతో.. జైల్లో చంద్రబాబు భద్రతపై కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది..
తన ప్రాణాలకు ముప్పు ఉందని చంద్రబాబు రాసిన లేఖ తీవ్రంగా కలచివేస్తోందన్నారు నారా భువనేశ్వరి.. జైల్లో ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మేం మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాం… ఆ జైలు గోడల వెనుకున్న నా భర్త భద్రత కోసం ప్రార్థిస్తున్నాను అన్నారు. రాష్ట్ర సోదరీమణులు అంతా నా ప్రార్ధనలో భాగస్వాములు కావాలని కోరుతున్నా.. మన ప్రార్థనలు చంద్రబాబుకి రక్షణ కవచంగా ఏర్పడాలని ఆకాక్షించారు. చంద్రబాబు ఈ కష్టాల నుంచి క్షేమంగా బయటపడేలా మనవంతు ప్రయత్నం చేద్దాం అని పిలుపునిచ్చారు. చంద్రబాబుపై పెట్టినవి ముమ్మాటికీ తప్పుడు కేసులే అన్నారు నారా భువనేశ్వరి.. మరోవైపు.. భద్రతా సమస్యలను వివరిస్తూ చంద్రబాబు రాసిన లేఖ తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు నారా బ్రహ్మణి.. చంద్రబాబు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అన్నారు.
కాగా, నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారు. నా పరువు, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. నాపై కుట్ర పన్నుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఓ లేఖ వచ్చింది. అయితే ఆ లేఖపై ఇప్పటివరకు పోలీసు అధికారులు ఏ విచారణ చేపట్టలేదు’ ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.. రాజమండ్రి జైలులో ఎన్నో ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసిరారు. తోటలో ఉన్న కొందరు ఖైదీలు గంజాయిని తీసుకున్నారు. జైలులో ఉన్న ఖైదీల్లో 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడినవారే.. కొంతమంది ఖైదీల వల్ల నా భద్రతకు ముప్పు పొంచి ఉందన్నారు.. అక్టోబర్ 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా ఓ డ్రోన్ ఎగిరింది. ములాఖత్‌లో భాగంగా నన్ను కలుస్తున్న వారి చిత్రాల కోసం డ్రోన్ ఉపయోగిస్తున్నారు. నాతో పాటు నా కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం ఉందంటూ చంద్రబాబు లేఖలో రాసుకురావడం చర్చగా మారింది.