టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమం.. ఈ విషయంలో ‘నిజం గెలవాలి’ పేరుతో యాత్రకు పూనుకున్నారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి..
యాత్రలో భాగంగా పరామర్శలు, ముఖాముఖి కార్యక్రమాలు, సభలు నిర్వహిస్తున్నారు.. ఇక, మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన నారా భువనేశ్వరి.. కొంత భావద్వేగానికి గురయ్యారు.. మనవడు దేవాన్ష్ తన తాత (చంద్రబాబు)ను అడిగాడు.. మేం, విదేశాలకు వెళ్లాడని చెప్పాల్సి వచ్చిందన్నారు.. కుంభకోణం అని చెబుతున్న డబ్బు ఏ అకౌంట్ లోకి వెళ్లింది అని చెప్పడం లేదన్న ఆమె.. ప్రజల సొమ్ము మా కుటుంబానికి అవసరం లేదన్నారు. సీఐడీ ఎప్పుడైనా వచ్చి విచారించుకోవచ్చు అని సూచించారు. ఇక, ములాఖత్ లో మాకు ఇచ్చే సమయం 30 నిమిషాలు.. అందులో 25 నిమిషాలు ప్రజల గురించి, పార్టీ గురించి అడుగుతారు.. మిగిలిన ఐదు నిమిషాలు మాత్రమే మా గురించి మాట్లాడుతారని గుర్తుచేసుకున్నారు.
ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఆయన్ను (చంద్రబాబు) ప్రజలకు దూరం చేయాలని, ఓర్వలేకే ఇలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు భువనేశ్వరి.. తండ్రి నుంచి నాకు కొంత పౌరుషం వచ్చింది.. చంద్రబాబు నుంచి క్రమశిక్షణ, ఓర్పు నేర్చుకున్నానని తెలిపారు. ఎప్పుడూ బయటకు రాని మహిళలు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అది చంద్రబాబు పై ఉన్న నమ్మకం అన్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల చేసిన లేఖపై కూడా విచారణ అంటే ఆశ్చర్యం వేస్తుందన్న ఆమె.. పనికిమాలిన అంశాలపై విచారణ ఏంటి? ప్రజల సమస్యలు గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని సలహా ఇచ్చారు. మేం చంద్రబాబు ఆహారంలో విషం కలుపుతున్నామని అంటున్నారు.. వారి ఆలోచన అంత హీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. మాకు ఆ కుసంస్కారం లేదన్న ఆమె.. దేవాన్ష్ తన తాతను అడిగాడు.. విదేశాలకు వెళ్లాడని చెప్పాం అన్నారు. పవన్ కల్యాణ్ కూడా మాలాగానే ఆలోచిస్తున్నారు.. అందుకే రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలన్నారు నారా భువనేశ్వరి..
ఇక, ‘ నిజం గెలవాలి ‘ సభలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఒక్కదాన్నే తిరుమల దర్శనానికి వెళ్తే చాలా బాధేసిందన్నారు.. ఇంట్లో నలుగురం నాలుగు దిక్కులు అయ్యాం.. చంద్రబాబు ను జైల్లో పెట్టి ఇప్పటికి 48 రోజులు అవుతోందన్నారు. ఎస్సీ యూనివర్సిటీ నుంచే చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైందని గుర్తుచేసిన ఆమె.. తిరుమలతో పాటు ఇతర పుణ్య క్షేత్రాలను చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు.. ప్రతి జిల్లాను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దారు.. చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారు.. కానీ, ఇప్పటి ప్రభుత్వం పెట్టిన హింస బరించలేక పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయని విమర్శించారు.. అమరరాజా పరిశ్రమ విషయంలో ఇదే జరిగింది.. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా పోయాయన్న ఆమె.. ఐఎస్ బి సంస్థ కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు.. కానీ, భయపెట్టి సంస్థలను వెళ్లగొడుతున్నారనరి ఆవేదన వ్యక్తం చేశారు. హింస, కేసులు, భయపెట్టడంలో ఏపీ నంబర్ వన్ గా మారిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి స్వాతంత్య్రం రావాలని ఇప్పుడు మనం పోరాటం చేస్తున్నాం.. తన కోసం చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి పలకరించమని నాకు చంద్రబాబు చెప్పారు.. ఎవరూ భయపడకండి అంటూ ధైర్యం చెప్పారు నారా భువనేశ్వరి.