AP

అమరావతే రాజధాని.. టీడీపీ, జనసేన మినీ మేనిఫెస్టో..

ఆంధ్రప్రదేశ్ లో కలిసి పోటీ చేయడానికి సిద్ధమైన టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే రెండుసార్లు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాయి. రాజమండ్రిలో తొలిసారి , విజయవాడలో రెండోసారి భేటీ అయ్యాయి. ఉమ్మడిగా కలిసి పోరాడాల్సిన అంశాలపై ఇరుపార్టీలు నేతలు చర్చించారు. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోపై టీడీపీ- జనసేన దృష్టిపెట్టాయి.

 

అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఇరుపార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా ఉమ్మడి మేనిఫెస్టోపై టీడీపీ, జనసేన నేతలు కసరత్తు చేశారు. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు సభ్యులకు మేనిఫెస్టో కమిటీలో స్థానం కల్పించారు. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, పట్టాభి, అశోక్ బాబు మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా ఉన్నారు. జనసేన నుంచి వరప్రసాద్, శరత్ కుమార్‌, ముత్తా శశిధర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

జనసేన-టీడీపీ మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే కొన్ని ఉమ్మడి అంశాలు ఉన్నాయి. వాటికి అదనంగా మరికొన్ని అంశాలను జోడించాలని ఇరుపార్టీల నేతలు నిర్ణయించారు. మేనిఫెస్టోలో చర్చించిన అంశాలను టీడీపీ , జనసేన నేతలు వెల్లడించారు. కొ మినీ మేనిఫెస్టోలో ఉమ్మడిగా 11 అంశాలు చేర్చామన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించడం, ఆక్వా, పాడి రైతులకు ప్రోత్సాహకం, ఉద్యాన రైతులకు రాయితీ, బీసీలకు రక్షణ చట్టం, జనసేన ప్రతిపాదించిన ‘సంపన్న ఆంధ్రప్రదేశ్‌’ అంశాలను మేనిఫెస్టోలో చేర్చామన్నారు.

 

పేదలను సంపన్నం చేయడం, రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయించామని టీడీపీ, జనసేన నేతలు తెలిపారు. రద్దు చేసిన సంక్షేమ పథకాలపై కమిటీ పరిశీలిస్తుందన్నారు. రైతులకు న్యాయం జరగాలనే అంశంతోపాటు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 10 లక్షల వరకు రాయితీ ఇచ్చే అంశాన్నీ మేనిఫెస్టోలో చేర్చామని వివరించారు.

 

మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిశారు. చంద్రబాబు జైలుకెళ్లిన వెంటనే ములాఖత్ అయిన జనసేనాని ఆ తర్వాత బయటకు వచ్చి పొత్తులపై ప్రకటన చేశారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని స్పష్టంగా చెప్పేశారు. ఆ తర్వాత నుంచి ఇరుపార్టీల ఉమ్మడి కార్యచరణకు కసరత్తు మొదలైంది.