AP

రాష్ట్రంలో కీలకమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్..

ఏపీలో నేటి నుంచి కులగణన ప్రారంభమైంది. బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా ఐదు గ్రామ/వార్డు సచివాలయాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడతారు. ఈ నివేదికలను పరిశీలించి నిర్వహణ, విధానపరమైన అంశాలను క్రోడీకరించనున్నారు. బుధ, గురువారాల్లో అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు దీనిపై సూచనలు, సలహాలను ఇవ్వొచ్చు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది.

 

Advertisement

ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలు, 20న విజయవాడ, విశాఖపట్నం, 24న తిరుపతిలో కుల గణనపై ప్రాంతీయ సదస్సులు జరుగుతాయి. బిహార్‌లో కులగణన కార్యక్రమం జరగడంతో అధ్యయనం కోసం అక్కడికి అధికారులను పంపించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల్లోని నిరుపేదలకు సామాజిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కులగణన చేపట్టిందన్నారు.

 

కుల గణన సర్వే కోసం వివిధ జిల్లాల్లో అధికారుల నిమాయకం కూడా పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా కుల గణన కార్యక్రమానికి తహశీల్దార్లు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. ప్రతి ఇంటికీ వాలంటీర్ ద్వారా ఈ కార్యక్రమం గురించిన సమాచారం అందిస్తారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కులాల లెక్కలు సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. వాలంటీర్లను ఇందులో భాగస్వామ్యం చేయడంలేదు. కేవలం సమాచారాన్ని చేరవేయడానికే వారినుంచి సహకారం తీసుకోనున్నారు.