AP

సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

ఏపీని మిచౌంగ్ తుపాన్‌ వణికిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తుఫాను గమనం..తాజా పరిస్థితులపైన అధికారులతో సమీక్షించారు. కీలక ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు విడుదల చేసారు. ఖరీప్‌ పంటల కాపాడుకోవడం ప్రధానమని చెప్పారు. కలెక్టర్లు,ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీలులేదని సీఎం స్పష్టం చేసారు. ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

 

చర్యలు వేగవంతం చేయండి:మిచౌంగ్ తుపాన్‌ పట్ల ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా అప్ర‌మ‌త్తంగా ఉంటూ సీరియస్‌గా ఉండాల్సిన అవసరం ఉంద‌ని సీఎం జగన్ ఆదేశించారు. తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారని వివరించారు. గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉండటంతో మరింత అప్రమత్తత అవసరం అని హెచ్చరించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని స్పష్టం చేసారు. పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదన్నారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు.

 

 

సాయం పెంచండి:తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, అప్పటివరకూ 181 తెరిచామని అధికారులు వివరించారు. అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలని సీఎం సూచించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5, ఎస్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5 కూడా ఉన్నాయని చెప్పారు. సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్‌, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలని సూచించారు.

 

ప్రత్యేక అధికారుల నియామకం:గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలన్నారు. విద్యుత్‌, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే యుద్ధ ప్రాతిపదికిన వాటిని సరిచేయాలని సీఎం జగన్ సూచించారు. తుపాను, వర్షాలు తగ్గాక పంటలకు జరిగిన నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాలన్నారు. తాను తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను, ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటానని వెల్లడించారు. ఒక ఫోన్‌ కాల్‌ దూరంలో మేం ఉంటాం. ఏం కావాలన్నా వెంటనే అడగాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికిన నడవాలని చెప్పారు. రేషన్‌ను వారికి సకాలంలో సక్రమంగా అందించాలని నిర్దేశించారు.