ఏపీలో ఎన్నికల వేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై భారీ ఊరట లభించింది. ఇన్నాళ్లూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభించామని, ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇది ఆగదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా దీన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెబుతూ వచ్చిన కేంద్రం.. ఇవాళ మాత్రం కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. తాజాగా పార్లమెంట్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందిస్తూ కీలక సమాచారం ఇచ్చింది. దీంతో కార్మికుల ఆందోళన కొంతమేర ఫలించినట్లే కనిపిస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విస్తృత సంప్రదింపుల తర్వాతే ముందుకెళ్తామని కేంద్రం ఇవాళ స్పష్టత ఇచ్చింది. ఉద్యోగులు, కార్మికుల ఆందోళన వల్లే ప్రైవేటీకరణ ఆలస్యమవుతోందా అని పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్ధిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాడే సమాధానం ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యూహాత్మక విక్రయానికి ఇందులో భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపాకే ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానిస్తామని కూడా వెల్లడించారు. 2021 జనవరిలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విక్రయానికి కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం ఇచ్చిందని గుర్తుచేశారు.
అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు విస్తృత సంప్రదింపులు అవసరమని భావిస్తున్నట్లు కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి కరాడే తెలిపారు. తద్వారా సంప్రదింపుల తర్వాతే ఈ ప్రక్రియ ముందుకు తీసుకెళ్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఎన్నికలు పూర్తయ్యే వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం పక్కనబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖలో కార్మికులు, ఉద్యోగులు నిత్యం ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ కాస్తో కూస్తో క్యాడర్ కలిగిన బీజేపీ ఇబ్బందుల్లో పడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయేలా చర్చలు జరుపుతున్నట్లు తాజాగా వెల్లడించారు. ఇప్పుడు కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంతో పూర్తి స్పష్టత వచ్చినట్లయింది.