ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. నేతల పార్టీల మార్పు వేగంగా జరుగుతోంది. ఏపీలో పట్టు పెంచుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. వైసీపీ సీట్ల ఖరారు వేళ సీటు ఖరారు కాని నేతలు కొందరు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. షర్మిల సైతం గతంలో కాంగ్రెస్ లో పని చేసిన నేతలను తిరిగి యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కడప జిల్లా సీనియర్లను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు.
కాంగ్రెస్ లో చేరికలు : ఏపీలో కాంగ్రెస్ తిరిగి పట్టు పెంచుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా షర్మిలకు పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగించింది. పార్టీలో చేరికల పైన షర్మిల ఫోకస్ చేసారు. కాంగ్రెస్ లో గతంలో కీలకంగా పని చేసి ఇప్పుడు వేరే పార్టీల్లో ఉన్న నేతలతో మంత్రాంగం ప్రారంభించారు. వైసీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ లో చేరారు. వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా పని చేసిన కొణతాలతో షర్మిల సమావేశమయ్యారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అప్పటికే కొణతాల జనసేనలో చేరేందుకు నిర్ణయించారు. ఇక, కడప జిల్లా నేతలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ముగ్గురు సీనియర్ నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
కడప జిల్లాపై ఫోకస్ : కడప జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. 2014 వరకు కాంగ్రెస్ లో పని చేసిన డీఎల్ రవీంద్రారెడ్డి చివరగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి దగ్గరయ్యారు. కొంత కాలంగా జగన్ వ్యవహార శైలి, ప్రభుత్వం పైన డీఎల్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాను ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలో చేరుతానని చెబుతూ వచ్చారు. డీఎల్ సొంత నియోజకవర్గం మైదుకూరులో టీడీపీ నుంచి సుధాకర్ యాదవ్ ఉన్నారు. టీడీపీలో చేరినా సీటు దక్కే అవకాశం లేదు. దీంతో, డీఎల్ తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారని కడప పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.
పట్టు చిక్కేనా : డీఎల్ రవీంద్రారెడ్డితో పాటుగా కమలాపురం నేత వీరశివారెడ్డి, మరో సీనియర్ వరదరాజుల రెడ్డి పేర్లు తెర మీదకు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో కడప నుంచే షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం జిల్లాలో కొనసాగుతోంది. టీడీపీ సైతం ఈ సారి ఎన్నికల్లో కడప జిల్లాలో జగన్ ను దెబ్బ తీయాలని భావిస్తోంది. వైసీపీ అటు వై నాట్ కుప్పం నినాదంతో ముందుకు వెళ్తుంటే..టీడీపీ వై నాట్ పులివెందుల అని నినదిస్తోంది. ఈ సమయంలో వైఎస్ షర్మిల కడప జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంనేది ఆసక్తి కరంగా మారుతోంది.