AP

జగన్ Vs చంద్రబాబు, ఆ మూడు రోజులే కీలకం – గెలుపు నిర్ణయం అక్కడే..!!

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 20 తరువాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతో, ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. వైసీపీ తమ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ హాయంలో చివరి విడత అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. అసెంబ్లీ వేదికగా కీలక పరిణామలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ఆ మూడు రోజులు వచ్చే ఎన్నికల్లో డిసైడిగ్ టైం కానున్నాయి.

 

అసెంబ్లీ సమావేశాలు : ఏపీలో ప్రస్తుత ప్రభుత్వ హాయంలో చివరి అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీవరకు మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 5న గవర్నర్‌ ప్రసంగం, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. 6,7 తేదీల్లో అసెంబ్లీలో బడ్జెట్‌ పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ సమావేశాల వేదికగా ఎన్నికల వరాలను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. మూడు నెలలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదించే ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ఈ ప్రకటనలు ఉంటాయని సమాచారం. ఇవి ఎన్నికల్లో ఓట్లు కురిపించే అస్త్రాలుగా వైసీపీ భావిస్తోంది.

 

ఎన్నికల వరాలు : ఇదే సమయంలో టీడీపీ ఇటు అసెంబ్లీ జరుగతున్న సమయంలోనే సీట్ల ప్రకటనకు సిద్దం అయింది. బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. బీజేపీ ముందుకు రాకపోతే సీపీఐ తో కలిసి వెళ్లాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ రెండు పార్టీల నుంచి తొలి జాబితా ప్రకటించనున్నారు. అదే సమయంలో బీజేపీ కలిసి వస్తే మూడు పార్టీల అభ్యర్దులను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక, అసెంబ్లీ వేదికగా రెబల్ ఎమ్మెల్యే పైన చర్యల విషయంలోనూ స్పష్టత రానుంది. వారికి స్పీకర్ కార్యాలయం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సారి విచారణ తరువాత స్పీకర్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ఓట్ బ్యాంక్ పై గురి : ఇక..బీజేపీ వైఖరి పైన ఈ సమయంలోనే క్లారిటీ రానుంది. పార్టీలు మారే నేతల అంశం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన పొత్తులో సీట్లు ఎవరికి దక్కుతాయి…రాని వారు ఎలాంటి వైఖరితో ఉంటారనేది తేలి పోనుంది. అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించే ఎన్నికల వరాలతో ఓట్ బ్యాంక్ ఏ మేర టర్న్ అవుతుందనే అంచనాలు తెలిసే అవకాశం ఉంది. ఇక..జగన్ వ్యూహాలకు ధీటుగా చంద్రబాబు, పవన్ తమ మేనిఫోస్టోకు తుది రూపు ఇవ్వనున్నారు. ఈ సమావేశాల తరువాత ముఖ్య నేతలు ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. దీంతో, ఫిబ్రవరి తొలి వారంలోని ఆ మూడు రోజులు వచ్చే ఎన్నికల్లో గెలుపుకు కీలకంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.