AP

హాట్ సీట్ మైలవరం వైసీపీ అభ్యర్థిగా..!!

కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ఖాయం చేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సిట్టింగ్ శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్‌కు ఈ సారి టికెట్ ఇవ్వట్లేదు. ఆయనకు బదులుగా మరో అభ్యర్థిని తెరమీదికి తీసుకొచ్చింది పార్టీ అగ్రనాయకత్వం.

 

వసంత కృష్ణ ప్రసాద్.. కొంతకాలంగా పార్టీపై వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి- పెడన ఎమ్మెల్యే, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌తో ఆయనకు విభేదాలు ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే పూనుకున్నారు. వారిద్దరినీ తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. సర్దిచెప్పారు.

 

అక్కడితో ఈ గొడవ సద్దుమణిగిందనుకున్నప్పటికీ.. అది సాధ్యపడలేదు. నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీకి దూరం అయ్యారు. దీనితోపాటు క్షేత్రస్థాయిలో ఆయనకు వ్యతిరేకంగా నివేదికలు వచ్చాయి. ఈ సారి కృష్ణ ప్రసాద్ గెలవటం కష్టం అనే నిర్ణయానికి వచ్చింది పార్టీ. దీనితో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని భావించింది.

 

దీనితో- మరో కొత్త నేత పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ సర్నాల తిరుపతిరావును మైలవరం ఇన్‌ఛార్జీగా అపాయింట్ చేసినట్లు సమాచారం. ఈ సాయంత్రం ఆయన కేశినేని నాని, జోగి రమేష్‌తో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు కూడా. ఈ సందర్భంగా ఆయనను మైలవరం ఇన్‌ఛార్జీగా నియమించినట్లు చెబుతున్నారు.

 

కాగా- ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో మైలవరం నియోజకవర్గం హాట్ సీట్‌గా మారింది. 2019 నాటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గంపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరింది. అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును మట్టికరిపించి మరీ.. ఘన విజయం సాధించారు వసంత కృష్ణప్రసాద్. ఆ పట్టును ఈ ఎన్నికల వరకూ కొనసాగించలేకపోయారు. ఫలితంగా టికెట్ కోల్పోవాల్సి వచ్చింది.