AP

టీడీపీకీ కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..

ఏపీలో ఎణ్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలకు రాజీనామాలు.. నేతల పార్టీల మార్పులు తారా స్థాయికి చేరాయి. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ కలిసి వస్తుందనే సంకేతాలు ఉన్నా అధికారిక నిర్ణయంతో అనిశ్చితి కొనసాగుతోంది. ఇదే సమయంలో అటు వైసీపీ, ఇటు టీడీపీలో సీనియర్లు పార్టీ వీడుతున్నారు. తాజాగా టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్ర దేవ్ రాజీనామా చేసారు.

 

టీడీపీకి రాజీనామా: కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్ర దేవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆయన లేఖ రాశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన ఆయన బీజేపీతో పొత్తు కోసం సంప్రదింపులు జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 

ఇదే విషయాన్ని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయమని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం కోసం తన అంతరాత్మను అమ్ముకోలేనని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు కిషోర్ చంద్రదేవ్. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు.

 

బీజేపీతో పొత్తు ఎఫెక్ట్: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కోటలో తన రాజీనామా ప్రకటన చేశారు. తాను ఐదేళ్ల క్రితం టీడీపీలో చేరానని.. అప్పట్లో టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు వి కిశోర్‌ చంద్రదేవ్‌.

 

ఆ విధానాల ప్రభావం వల్లే తాను టీడీపీలో చేరానని చెప్పారు. బీజేపీతో పొత్తుకు టీడీపీ ప్రయత్నిస్తోందనే కారణంతోనే పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపానని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరనని, స్వతంత్రంగా పోటీచేయడానికి అరకు పార్లమెంటు స్థానం అనువైనది కాదన్నారు. అందువల్ల తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మన భిన్నత్వం మధ్య ఐక్యత మన రాజ్యాంగానికి హాల్‌ మార్క్‌ అన్నారు.

 

ఎన్నికల రాజకీయం: ఇప్పటికే చిన్నాభిన్నమైన సమాజంలో మతోన్మాదుతులు చీలికలు సృషిస్తున్నారన్నారు. మతోన్మాదుల బీభత్స పాలనకు తెరలేపడం ద్వారా ఓటు బ్యాంకులను సృష్ట్టించుకోవడమే ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ వన్‌ పాయింట్‌ ప్రోగ్రాంగా కనిపిస్తోందన్నారు. తన రాజకీయ జీవితంలో 5వ దశాబ్దంలో.. తాను చూసిన అత్యంత దారుణమైన పరిస్థితి ఇదే అన్నారు.

 

విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయం. అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేను అని రాజీనామా లేఖ రాశారు. బీజేపీతో టీడీపీ పొత్తు ఖాయమని భావిస్తున్నా..రెండు పార్టీల నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి నిర్ణయం జరగలేదు. దీని పైన వచ్చే వారం నిర్ణయం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.