రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమౌతోన్నారు.
దీనికి పోటీగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టింది. రా.. కదలిరా పేరుతో ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తోన్నారు. అటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా శంఖారావం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోన్నారు.
అదే సమయంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది. శనివారం అంటే ఫిబ్రవరి 24వ తేదీన దీన్ని విడుదల చేయనుంది. 50 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. దాదాపుగా అన్ని కీలక స్థానాల్లో అభ్యర్థుల పేర్లతో ఈ జాబితా తయారైంది.
శనివారం- మాఘ పౌర్ణమి కలిసి వచ్చిన నేపథ్యంలో ముహూర్తబలం కలిసి వస్తుందని ఆశిస్తోన్నారు చంద్రబాబు. జాబితా విడుదల కానున్న నేపథ్యంలో- ఉండవల్లి నివాసానికి రావాల్సిందిగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యురో సభ్యులు, తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. వంటి కీలక నాయకులకు టీడీపీ సందేశాన్ని పంపించింది.
ఎన్నికల గడువు సమీపిస్తోన్నందువల్ల అభ్యర్థుల జాబితాను వెల్లడించడంలో ఎలాంటి జాప్యం చేయకూడదని భావిస్తోంది టీడీపీ అగ్ర నాయకత్వం. బీజేపీతో పొత్తు అంశం తేలనప్పటికీ.. మిత్రపక్షం జనసేనతో సీట్ల పంపకాల వ్యవహారం ఓ కొలిక్కి రానప్పటికీ.. వివాదం లేని, తాము ఖచ్చితంగా పోటీ చేయాలని భావించిన స్థానాల జాబితాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చింది.
టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మకాయల చినరాజప్ప, నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత / పరిటాల శ్రీరామ్, ఆనం రామనారాయణ రెడ్డి, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి.. వంటి నేతల పేర్లు తొలి జాబితాలో ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో జాబితా రూపకల్పనలో అన్ని జాగ్రత్తలను తీసుకుంది తెలుగుదేశం పార్టీ. అభ్యర్థుల ఎంపికలో ఇంటారిక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానాన్ని అనుసరించింది. నేరుగా ఓటర్ల నుంచే అభిప్రాయాలను సేకరించింది. వాటన్నింటినీ క్రోడీకరించిన తరువాతే తొలి జాబితాకు తుది రూపాన్ని ఇచ్చింది.