ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సీఎం జగన్ ఇప్పటికే మూడు సభల ద్వారా కేడర్ ను ఎన్నికలకు సంసిద్దులను చేసారు. చివరి సిద్దం సభ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా నిర్ణయించారు. ఈ నెల 3న చిలకలూరి పేటలో నాలుగు జిల్లాల పార్టీ కేడర్ తో సిద్దం సభ జరగనుంది. ఇటు ఎన్నికల మేనిఫెస్టో పైన జగన్ కసరత్తు ప్రారంభించారు. సిద్దం సభలో సీఎం జగన్ రుణమాఫీ ప్రకటించనున్నారు. పెన్షన్ పెంపు పైన స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది.
జగన్ కసరత్తు : అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేసామని జగన్ చెబుతున్నారు. తాము మాట ఇస్తే అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే హామీల పైన కసరత్తు చేస్తున్నారు. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అటు జనసేన కొన్ని హామీలతో ఎన్నకల బరిలోకి దిగుతోంది. బీజేపీ తో పొత్తు ఖాయమైన తరువాత ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని భావిస్తున్నారు. మూడు పార్టీల హామీలకంటే ముందుగానే జగన్ ఈ సారి తన ఎన్నికల వరాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికల వరాలు : మార్చి 3న చిలకలూరిపేటలో వైసీపీ చివరి సిద్దం సభ జరగనుంది. ఈ సభా వేదికగా సీఎం జగన్ రైతు రుణమాఫీ ప్రకటిస్తారని సమాచారం. రాప్తాడు సభలోనే ప్రకటిస్తారని భావించినా..మరో సభ ఉండటంతో చివరి సభలో ప్రకటించాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, పరిమితి ఎంత మేరు రుణమాఫీ ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. 2014 ఎన్నికల సమయంలోనే చంద్రబాబు కు ధీటుగా రైతు రుణ మాఫీ హామీ ఇవ్వాలని తన పైన ఒత్తిడి వచ్చినా..సాధ్యం కాని హామీలు ఇవ్వనని స్పష్టం చేసానని జగన్ గుర్తు చేసారు. ఏపీలో దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వారందరినీ ఆకట్టుకునేలా రైతులకు కీలక హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
రైతులు,మహిళలే లక్ష్యంగా : ఇప్పుడు రుణమాఫీతో పాటుగా ప్రస్తుతం రూ 3 వేలుగా ఉన్న పెన్షన్ కానుక రూ 4 వేలకు పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు వరాలను సిద్దం సభలో ప్రకటించే ఛాన్స్ ఉంది. 2019లో ఇచ్చిన నవరత్నాలను కొనసాగిస్తూనే ఈ సారి మహిళలకు ప్రాధాన్యత పెంచేలా కొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని సమాచారం. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు ఇలా అన్ని రంగాల వారిని ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. యువతకు సంబంధించి ఈ సారి జగన్ మేనిఫెస్టోలో ప్రత్యేక అంశాలు ఉంటాయని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో, జగన్ ప్రకటించే మేనిఫెస్టోలోని అంశాల పైన ఆసక్తి కొనసాగుతోంది.