ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ఎంత సంచలనంగా మారిందో చూస్తున్నాం. ప్రతిపక్ష నేతల ఫోన్లను భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేకమైన అధికారులను దీనికి నియమించి వారి ఫోన్లను ట్యాప్ చేయించారంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత బొండా ఉమ విలేకరుల సమావేశం నిర్వహించి ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసేందుకు కేసీఆర్, జగన్.. ఇద్దరూ కలిసి ఒకేసారి పెగాసస్ సాఫ్ట్ వేర్ కొన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ నేతల ఫోన్లు జగన్ ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. తమను ఫాలో అవుతున్న కొందరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు వెల్లడించారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందంటూ అభియోగం మోపారు.
విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారంటూ ఆధారాలను బయటపెట్టారు. ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు నేతృత్వంలో ఈ ట్యాపింగ్ జరుగుతోందని, గతంలోకూడా మంత్రులు పెద్దిరెడ్డి గుడివాడ అమర్నాథ్ ట్యాపింగ్ విషయాన్ని చెప్పినట్లు బొండా ఉమ గుర్తుచేశారు.
పార్టీ వర్క్ షాప్ కు ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చారని, విశ్వేశ్వరరావు అనే వ్యక్తి తమ సమావేశంలోకి వచ్చారని.. ఐజీ పంపితేనే వచ్చానని ఆ కానిస్టేబుల్ చెప్పారన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని ఉమ ప్రశ్నించారు. ట్యాపింగ్ కు పాల్పడ్డవారిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆ కానిస్టేబుల్ ను పట్టుకుంటే అన్ని విషయాలు బయటకు వచ్చాయని కేశినేని చిన్ని తెలిపారు. టీడీపీ నాయకులపై నిఘా బదులుగా డ్రగ్స్ ఎవరు తెచ్చారనే విషయంపై దృష్టిపెడితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని హితవు పలికారు.