రాజకీయ పార్టీల ఇంటింటి ప్రచారానికీ అనుమతి తీసుకోవాల్సిందేనని ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు సువిధ పోర్టల్ Suvidha.eci.gov.in వినియోగించాలని సీఈవో తెలిపారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇంటింటి ప్రచారానికి, సభలు, ర్యాలీల నిర్వహణకు అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు.
ఇక, సభలు, ర్యాలీలు, ప్రచారంపై 48 గంటల ముందుగానే సువిధ యాప్, పోర్టల్ నుంచి సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసిన 24 గంటల్లోగా ప్రచారానికి సంబంధించిన అన్ని అనుమతులు జారీ అవుతాయని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ నామినేషన్లు, అఫిడవిట్ దాఖలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల కోసమే సువిధా పోర్టల్ రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుసరించాల్సిన విధి విధానాలు, తీసుకోవాల్సిన అనుమతులపై అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. అయితే, . ఈసీ నిబంధనలపై అధికార, ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిబంధనల వల్ల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నాయి.
కాగా, గతంలో ఎప్పుడూ ఈ తరహా నిబంధన లేదన్నారు టీడీపీ నేతలు. 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ ఈ తరహా నిబంధనలు లేవు. ఇంటింటి ప్రచారానికి ప్రతీ ఒక్కరికీ అనుమతి కావాలనటం అభ్యంతరకరమైన విధానమని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా అన్నారు. ఇది చాలా అభ్యంతరకరమని ఎన్నికల ప్రధానాధికారికి తెలియచెప్పామన్నారు. మరోవైపు, ఎన్నికల్లో ఇంటింటికీ ప్రచారానికి అనుమతి తీసుకోవాలంటే ఎలా వీలవుతుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. కరపత్రాలు పంపిణీ చేయాలన్నా అనుమతి అంటే ఇబ్బంది అని ఈసీకి చెప్పామన్నారు